Jharkhand witchcraft murder: తమ కూతురిపై చేతబడి చేసి అనారోగ్యానికి గురిచేశారన్న కోపంతో వృద్ధ దంపతులను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి, కర్రలతో బాది చంపారు బంధువులు. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడి గొడ్డలి, కర్రలతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన ఝార్ఖండ్, గుమ్లా జిల్లాలోని భగత్ బకుమా గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు సుమిత్రా దేవీ, ఆమె కుమారుడు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మృతులు లుంద్రా చిక్ బరాయిక్(65), ఆయన భార్య పుల్వామా దేవీగా(60) గుర్తించారు.
అసలేం జరిగిదంటే..: నిందితురాలు సుమిత్రా దేవీ కుమార్తెకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. లుంద్రా దంపతులు చేతబడి చేయడం వల్లే తన కుమార్తె ఆరోగ్యం క్షీణించినట్లు భావించిన సుమిత్రా దేవీ కుటుంబం.. లుంద్రా దంపతులపై కోపం పెంచుకుంది. తమకు సుమిత్రా దేవీ కుటుంబం నుంచి ప్రాణ హానీ ఉందని ఇటీవలే గ్రామ పెద్దలను ఆశ్రయించారు లుంద్రా. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోవటం వల్ల పోలీసులను సైతం ఆశ్రయించాడు లుంద్రా. అయితే.. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడిన నిందితులు.. లుంద్రా దంపతులను హత్య చేశారు.
ఇదీ చదవండి: చేయని నేరానికి 28ఏళ్లు జైలులోనే.. నిర్దోషిగా తేలేసరికి..