Pawan Kalyan Election Campaign: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ముందు నుంచి చెప్తునట్టుగానే నేడు వారాహి యాత్రను ప్రారంభించారు. కాకినాడ జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీని స్థాపించి పదేళ్లపాటు నడపడం సాధారణ విషయం కాదన్న పవన్.. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అసాధ్యమని వెల్లడించారు. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటేనే పార్టీని నడపగలమని పేర్కొన్నారు. పార్టీల భావజాలం అర్థం చేసుకునే వ్యక్తులుంటేనే పార్టీని నడపగలమని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని జనసేన గుండెల్లో పెట్టుకుందని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని యువతరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తిలోనూ మంచిని తీసుకుని చెడును వదిలేయాలని పవన్ వెల్లడించారు.
ఇకపై రాజకీయాలు ఆంధ్ర నుంచే: భవిష్యత్‌లో వైసీపీని ఎదుర్కొనేది జనసేన మాత్రమే అని పవన్ వెల్లడించారు... దమ్ముంటే తనను అడ్డుకోవాలని సీఎంకు పవన్ సవాలు విసిరారు. పార్టీ నడిపేందుకే సినిమాలు చేస్తున్నానని పవన్ పేర్కొన్నారు. విభజించే పాలన చేస్తూ... వేల కోట్లు దోచేస్తూ తనను లక్ష్యంగా చేసుకున్నారని పవన్ ఆరోపించారు. తనను అడ్డుకునేందుకు తన సినిమాలను అడ్డుకున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల మీద కూడా దిగజారిపోయే వ్యక్తి ఈ సీఎం అని పవన్ విమర్శించారు. తెలంగాణను దోచుకున్నారని ఏపీ నేతలు తిట్టించుకున్నారన్న పవన్.. విడిపోయిన తర్వాతైనా ఆంధ్ర నేతలకు బుద్ధి రావాలి కదా అని పవన్ ఎద్దేవా చేశారు. జనసేన కేంద్ర కార్యాలయం ఏపీలో ఉండాలనే తన పిల్లల కోసం పెట్టిన నిధితో పార్టీ ఆఫీస్ కట్టానని వెల్లడించారు. ఇకపై మొత్తం రాజకీయాలు ఆంధ్ర నుంచే చేస్తానని పవన్ వెల్లడించారు.
విడిగా రావాలో? ఉమ్మడిగా రావాలో? నిర్ణయించుకోలేదు: జనసేన విడిగా పోటీ చేయాలని అంటున్నారన్న పవన్ విడిగా రావాలో? ఉమ్మడిగా రావాలో? నిర్ణయించుకోలేదని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలో అడుగుపెడతానని, అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ని వ్యూహాలైనా వేస్తానని పేర్కొన్నారు. తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని కక్షగట్టి ఓడించారన్న పవన్.. ఈసారి తనను అసెంబ్లీకి రాకుండా ఎవరడ్డుకుంటారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. ప్రజల్లో ధైర్యం నింపాలని రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్.. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు తనకు తెలుసన్న పవన్ కల్యాణ్ .. వైసీపీ నేతల తప్పుడు పనులపై నా గదిలో చాలా ఫైళ్లున్నాయని వెల్లడించారు. అయినా.. వ్యక్తిగత విషయాల జోలికి రాకుండా పాలసీ విధంగా విమర్శిస్తానని వెల్లడించారు.
రాజకీయాల్లో అక్రమంగా సంపాదించిన వ్యక్తులతో నా పోరాటమన్న పవన్, అక్రమంగా రూ.వేల కోట్లు కూడబెట్టిన వారితోనే నా గొడవ అని పేర్కొన్నారు. అధికారి అవినీతి చేస్తే అ.ని.శా. అధికారులు పట్టుకుంటారన్న పవన్.. ముఖ్యమంత్రే అవినీతి చేస్తే ఎవరూ పట్టించుకుంటారని ప్రశ్నించారు. సీఎం అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారని ఎద్దేవా చేశారు. వివేకా కేసులో అన్ని దారులూ సీఎం ఇంటివైపు చూపుతున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వివేకా కేసులో లాయర్ లేకపోతే ఆయన కుమార్తె వాదించుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.