Iron Lady Of Chattisgarh: అనితా దువాని పరీక్షించినట్టు విధి ఈ ప్రపంచంలో మరొకరిని పరీక్షించి ఉండదు. ఛత్తీస్‌గఢ్, బిలాస్‌పుర్‌కు చెందిన అనితకు అప్పటికి 30 ఏళ్లుంటాయి. భర్త, ఒక అమ్మాయి, అబ్బాయి. చీకూ చింతల్లేని కాపురం. అలా హాయిగా సాగిపోతున్న ఆమెకు గర్భాశయ క్యాన్సర్ రూపంలో మొదటి సవాలు ఎదురైంది. మరొకరైతే శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ కుంగిపోతారు. అనిత అదరలేదు, బెదరలేదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడంతో చికిత్స తీసుకుని బయట పడగలిగింది.
సరిగ్గా అదే సమయానికి భర్త మరణం రూపంలో రెండో సవాల్. ఈ కష్టానికీ ఎదురు నిలిచింది. కన్నీళ్లని దిగమింగుకుని భర్త నడిపే రంగుల తయారీ వ్యాపారాన్ని తాను చేపట్టింది. పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసింది. పెళ్లి చేసిన ఏడాదికే చెట్టంత కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ దుఃఖం ఆమెను మానసికంగా క్యాన్సర్ కంటే ఎక్కువగా గాయపరిచింది. తేరుకోవడానికి రెండేళ్లు పట్టింది. కోడలి భవిష్యత్తు గురించి ఆలోచించి అందులోంచి బయటపడింది. తనకిద్దరు ఆడపిల్లలనుకుంది. ఎన్నో ఆశలతో తనింట అడుగుపెట్టిన అమ్మాయి జీవితం ఇలా మోడు వారడం నచ్చలేదు. అందుకే ఆమెకు మళ్లీ పెళ్లి చేసి పంపింది. అప్పుడప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటుందనగా.. ఈ సారి అనితకు రొమ్ము క్యాన్సర్ నిర్ధరణ అయ్యింది. ఈ సవాలునీ నవ్వుతూనే స్వీకరించింది తప్ప నాకే ఎందుకీ కష్టాలు అనుకోలేదు. రెండో సారీ క్యాన్సర్‌పై పోరాటంలో గెలిచింది.
మరో ఊరట.. అమ్మాయి నిధి.. దుర్గ్ కోర్టులో మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆరోగ్య కారణాల వల్ల వ్యాపారాన్ని నిలిపేయాల్సి వచ్చింది అనితకి. అలాగని ఆగిపోలేదు. యోగాని జీవితంలో భాగం చేసుకున్న తను దాని ప్రయోజనాలు అందరికీ అందించాలని ఉచిత శిక్షణను ప్రారంభించింది. 'యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం పొందుతాం. దీని వల్ల జీవితంలో కష్టాల్ని ఎదుర్కొనేందుకు రెండు విధాలైన బలం వస్తుంది' అంటారామె. దాంతోనే ఏ కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు తనను తాను సిద్ధం చేసుకుంది.
ఆ దశలో 2017లో కాలర్ బోన్ క్యాన్సర్ రాగా, దాన్నీ చికిత్సతో ఎదుర్కొంది. తన స్నేహితురాలి సూచనతో 57 ఏళ్ల వయసులో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 'ఇది నా సంతోషం కోసం కాదు, క్యాన్సర్ అంటే జీవితానికి ముగింపు కాదని తోటి మహిళలకు భరోసా ఇవ్వడానికి' అని చెప్పే అనిత గుండుతోనే ఫ్యాషన్ షోలలో పాల్గొంది. మోడల్‌గా.. దివా ఆఫ్ ఛత్తీస్‌గఢ్, బెస్ట్ స్మైల్, ఇన్నర్ బ్యూటీ.. తదితర అవార్డుల్నీ అందుకుంది. రక్తదానమూ చేస్తోంది. ఇప్పుడు అనిత వయసు 62. రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో పోరాడుతోంది. 'అది ఓడిస్తే సరే, ముందే భయంతో నేనైతే ఓడిపోను' అంటూ తనని ఓదార్చే వాళ్లకే ధైర్యం చెబుతోంది. పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపంగా నిలుస్తోన్న అనితను 'ఐరన్ లేడీ' అని పిలుచుకుంటారు బిలాస్‌పుర్ వాసులు.