Indian flight emergency landing in Pakistan: దిల్లీ నుంచి దుబాయి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయకపోవడమే ఇందుకు కారణం.
స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్జీ-11 విమానం 150 మంది ప్రయాణికులతో మంగళవారం దిల్లీ నుంచి దుబాయికి బయలుదేరింది. అయితే.. ఫ్యూయల్ ఇండికేటర్ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. ముందు జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేయాలని భావించారు. దగ్గర్లోని కరాచీ ఎయిర్పోర్ట్ ఏటీసీని సంప్రదించారు. వారి సూచనల మేరకు విమానాన్ని ల్యాండ్ చేశారు.
"విమానం ఎడమ వైపు ట్యాంకులో ఇంధనం ఒక్కసారిగా తగ్గిపోయిందని సిబ్బంది గుర్తించారు. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తించేందుకు చెక్‌లిస్ట్ ప్రకారం అన్నింటినీ పరిశీలించారు. అయినా ఇంధనం అలా తగ్గిపోతూనే ఉంది. అందుకే ఏటీసీతో సమన్వయం చేసుకుంటూ విమానాన్ని కరాచీకి మళ్లించారు. విమానం ల్యాండ్ అయ్యాక చూస్తే.. ఎడమ వైపు ట్యాంక్ నుంచి ఇంధనం లీక్ అవుతున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు" అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వారి కోసం మరో విమానం:
స్పైస్‌జెట్ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్ నుంచి పంపారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, అందుకే కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది.