India Corona Third wave: భారత్‌లో రోజూ రెండు లక్షలకుపైగా కేసులతో విజృంభిస్తున్న కరోనా థర్డ్ వేవ్... ఈనెల 23న పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే.. రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షల లోపే ఉంటుందని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని వివరించారు. ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్, 'సూత్ర కొవిడ్ మోడల్' పరిశోధకుల్లో ఒకరైన మణీంద్ర అగర్వాల్ ఈ విషయం వెల్లడించారు.
కరోనా మహమ్మారి ఆరంభం నుంచి భారత్‌లో వైరస్ వ్యాప్తి క్రమాన్ని అంచనా వేసేందుకు 'సూత్ర కొవిడ్ మోడల్'నే అనుసరిస్తున్నారు.
మణీంద్ర చెప్పిన మరిన్ని కీలక విషయాలు:
- దిల్లీ, ముంబయి, కోల్‌కతా గత వారంలోనే కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌ను చూశాయి.
- మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, గుజరాత్, హరియాణాలో ఈ వారం కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది.
- ఆంధ్రప్రదేశ్, అసోం, తమిళనాడులో వచ్చే వారం అత్యధిక సంఖ్యలో రోజువారీ కేసులు నమోదై, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయి.
నిజానికి.. జనవరి నెలాఖరుకు కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని మణీంద్ర ఇటీవల అంచనా వేశారు. రోజువారీ కేసుల సంఖ్య గరిష్ఠంగా 7.2లక్షలు ఉండొచ్చని తొలుత భావించారు. అయితే.. "దేశవ్యాప్తంగా మా అంచనాలన్నీ చాలా వేగంగా మారుతున్నాయి. టెస్టింగ్‌కు సంబంధించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు మార్చడమే ఇందుకు కారణం. అయితే.. ఇప్పటికీ కొన్ని చోట్ల కొత్త మార్గదర్శకాలు అమలు కాలేదు. ఆయా చోట్ల మా అంచనాలు అలానే ఉన్నాయి. జనవరి 11 వరకు ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే ఈనెల 23న అత్యధికంగా 7.2లక్షల కేసులు నమోదు కావచ్చొని అనుకున్నాం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల మధ్య ఆ సంఖ్య 4 లక్షల లోపే ఉండొచ్చు." అని తెలిపారు మణీంద్ర.
అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసే వారు, కొవిడ్ సోకిన వారి కాంటాక్టులు.. హైరిస్క్ కేటగిరీలో ఉంటే తప్ప టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇటీవల సూచించింది.
Omicron in India:
లెక్కలు మారింది ఇందుకే..
"వైరస్ వ్యాప్తి తీవ్రతలో మార్పు రావడానికి రెండు కారణాలున్నాయి. జనాభాలో రెండు వర్గాలున్నాయి. మొదటిది.. ఒమిక్రాన్ తట్టుకునేందుకు తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వారు. రెండోది.. ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగినవారు. మొదటి వర్గం వారిలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. అందుకే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే మొదటి వర్గంలో చాలా మందికి కరోనా సోకింది. అందుకే వైరస్ వ్యాప్తి నెమ్మదించింది.
రెండో కారణం.. గతేడాది నవంబర్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు ప్రజల్లో చాలా భయాందోళనలు ఉండేవి. అయితే.. కొత్త వేరియంట్‌తో పెద్ద ప్రమాదం లేదని గత వారంలో ప్రజలకు అర్థమైంది. టెస్టులు చేయించుకోకుండా తెలిసిన విధానంలో చికిత్స చేసుకుందామన్న ఆలోచన వారికి కలిగింది." అని వివరించారు మణీంద్ర.
India Corona cases today:
భారత్‌లో మంగళవారం ఒక్కరోజే 2,82,970 కేసులు నమోదయ్యాయి. 441 మంది మరణించారు. అధికారిక లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,79,01,241 కరోనా బారిన పడ్డారు. 4,87,202 మంది ప్రాణాలు కోల్పోయారు.