High Court Dismissed Chandrababu Bail Petitions: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ 3 కేసులపై హైకోర్టు ఇటీవల విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఈ కేసుల్లో తీర్పును వెల్లడించింది.
Amaravati Inner Ring Road Case: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే రోడ్డుల ఎలైన్‌మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ గత ఏడాది మే 9వ తేదీన పలువురిపై కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ రోజు తీర్పు వెలువరించింది.
AP Fibernet case: గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు నాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబుని బాధ్యుడిని చేయడం సరికాదని, రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.
రెండేళ్ల క్రితం కేసుపెట్టి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని, ఇప్పుడు ఒక్కసారిగా ఆయన పేరును చేర్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో ఆయన లేరనడం సరికాదని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేశాక చంద్రబాబు ప్రమేయాన్ని గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. ఇరు వైపుల వాదనలు అనంతరం తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
Angallu Incident: మరోవైపు అంగళ్లు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట ఆగస్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఆ సమయంలో అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లనూ కొట్టివేసింది.