దేశంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. హాంగ్‌కాంగ్ ఫ్లూగా పిలిచే హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. హరియాణా, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ లక్షణాలతో మరణించినట్లు పేర్కొన్నాయి. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఆసుపత్రిలో చేరికలకూ ఇది కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించాయి.
అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90కి పైగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుయెంజా మరో రకమైన హెచ్1ఎన్1 కేసులు కూడా ఎనిమిది నమోదయ్యాయి. జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట ఈ వైరస్ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతున్నప్పటికీ దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది. దీని కారణంగా ఆసుపత్రిలో చేరికలు తక్కువగానే ఉంటున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కర్ణాటక హసన్ జిల్లాకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్‌తో మరణించిన తొలి వ్యక్తి అని కేంద్ర ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ తెలిపారు. అలాగే బాధితుడు హీరే గౌడ(82) ఫిబ్రవరి 24న ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడని.. మార్చి 1న మరణించాడని ఆయన వెల్లడించారు. హీరే గౌడ మరణం తర్వాత అతడి సాంపిల్స్‌ను పరీక్ష కోసం పంపగా మార్చి 6న హెచ్3ఎన్2 పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని పేర్కొన్నారు. మృతుడికి మధుమేహం, రక్తపోటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.
మరోవైపు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించిన హరియాణాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తికి జనవరి 17న హెచ్3ఎన్2 వైరస్ సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఆయన ఫిబ్రవరి 8న మరణించినట్లు వెల్లడించారు.
ఈ రెండు మరణాలతో ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెంజా పరీక్షలు 60 ఏళ్లు పైబడిన వారికి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ తెలిపారు.
ఇవీ చదవండి: