అతి వేగం ఆరుగుర్ని బలిగొంది. గుజరాత్ ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం దగ్గర్లో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఆనంద్, తారాపుర్ను కలిపే రాష్ట్ర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్యూవీ.. ఆటోను, బైక్‌ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులంతా సోజిత్రా, బొరియావీ గ్రామాల ప్రజలని నిర్ధరించారు. గుజరాత్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్ పదియార్.. ఎస్‌యూవీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని ప్రాథమికంగా తేల్చారు. కాసేపటికే కేతన్‌ను అరెస్టు చేశారు. ఆరుగురు మరణానికి కారణమయ్యాడని ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు.