దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశావాద దృక్పథానికి అనుగుణంగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తన నివేదికలను రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. వీటిపై స్పందించిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ.. ఇది రెచ్చగొచ్చే, దృష్టి మరల్చే కథనమేనని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, వ్యాక్సినేషన్‌ను అద్భుతంగా పంపిణీ చేస్తోన్న సమయంలో ఇలాంటి కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. అయితే, అందులో ఎక్కువగా కొవిడ్ మరణాలపై లేవనెత్తిన అంశాలేనని.. వాటిపై శ్రద్ధ చూపాల్సినంత అవసరం లేదన్నారు. ఇక కొవిడ్ పోరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిమగ్నమైన విషయాన్ని గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ కూడా ఖండించారు.
న్యాయవిచారణ జరపాల్సిందే..!
దేశంలో సెకండ్ వేవ్‌కు ముందు కొవిడ్ ప్రభావాన్ని తక్కువ చూపించేందుకు ప్రయత్నం చేసినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ మండిపడింది. ముఖ్యంగా కొవిడ్ మరణాలను వెల్లడించడంలో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించిందని పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఎత్తిచూపింది. నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా అధికారులు తప్పదోవపట్టించే ప్రయత్నం చేశారని విమర్శించింది. ఇది తీవ్రమైన అంశమని.. దీనిపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. కొవిడ్ ప్రభావాన్ని తక్కువగా చేసి చూపించడం వల్లే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కాలేకపోయాయని ఆరోపించారు. దీంతో భారీ స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవించిన విషయాన్ని అజయ్ మాకెన్ గుర్తు చేశారు.
ఇవీ చదవండి: