Gang Rape on Minor Girl: ప్రేమ పేరుతో దళిత బాలికకు వల వేశాడు.. మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి.. మరొకరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలిక.. కాలువలో శవమై తేలింది. కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (14) ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే బాలిక ఉండే వీధికి తరచు వచ్చే లోకేష్.. ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. ఈ నెల 20న బాలికకు ఫోన్ చేసిన లోకేష్.. ఇద్దరం ఏకాంతంగా గడుపుదామని చెప్పాడు. దీంతో పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పిన బాలిక.. స్కూలు బ్యాగుతో బయటకు వచ్చింది. స్కూలు వరకు వెళ్లి.. లోపలికి వెళ్లకుండా బ్యాగ్‌ను గేటు బయటే వదిలేసింది. అటుగా వెళ్లేవారిని లిఫ్ట్ అడిగి విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి పై వంతెన వద్ద దిగింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన లోకేష్.. తన వాహనంపై ఆ బాలికను తీసుకెళ్లాడు.
లాడ్జికి తీసుకెళ్లి సోదరుడితో కలిసి అత్యాచారం: లోకేశ్.. బాలికను ఉయ్యూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తనకు వరుసకు సోదరుడయ్యే నరేంద్రకు ఫోన్ చేసి అక్కడికి పిలిచాడు. అలా ఒకరి తర్వాత మరొకరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు పాఠశాల బయట ఉన్న బ్యాగును చూసిన వాచ్ మెన్.. విషయాన్ని పాఠశాల హెచ్ఎంకు చెప్పాడు. దీంతో అతను తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కంగారుగా పాఠశాలకు వచ్చిన తల్లికి, బాలిక స్కూలుకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పారు.
విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ రేప్.. వీడియో తీసి వైరల్ చేసిన మహిళ.. చివరకు..
తల్లి ఇంటికి తిరిగి వస్తుండగా బాలికకు లిఫ్ట్ ఇచ్చిన యువకుడు కనిపించి.. వంతెన వద్ద దించానని, తన ఫోన్ నుంచి లోకేష్ అనే యువకుడికి కాల్ చేసిందని అతను చెప్పాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు లోకేష్‌కు ఫోన్ చేసి నిలదీశారు. లాడ్జిలో ఉన్న అతడు.. కంగారు పడి బాలికను ఇంటి దగ్గరలో దించి వెళ్లాడు. అయితే బాలిక రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు పామర్రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మనస్తాపంతో ఆత్మహత్య?: లోకేష్, నరేంద్రలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను బాలికను ఆమె ఇంటి దగ్గరలో వదిలివెళ్లానని విచారణలో చెప్పాడు. ఇంతలో మొవ్వ మండలం సూరసానిపల్లి పంట కాలువలో ఆదివారం రాత్రి బాలిక డెడ్‌బాడీ లభ్యమైంది. మనస్తాపంతో కాలువలోకి దూకి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై సామూహిక అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపణ, ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.