G20 Summit 2023 Agenda India : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న.. జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం నుంచి అగ్రదేశాధినేతలు ఒక్కొకరు దిల్లీకి రానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు.. దిల్లీ విమానాశ్రయంలో దిగనున్నారు. సునాక్‌కు.. కేంద్ర సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన షంగ్రి-లా హోటల్‌లో బసచేయనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రానున్నారు. అగ్రదేశాధినేతల రాక దృష్ట్యా దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌ను మోహరించారు. జీ20 కూటమిలోని సభ్యదేశాలతో పాటు.. 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు కూడా సదస్సులో పాల్గొనేందుకు దిల్లీ రానున్నారు. శనివారం నుంచి జరగనున్న శిఖరాగ్ర సదస్సు ముందు భారీ అజెండానే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై సదస్సు దృష్టిసారించనుంది.
G20 Summit 2023 Theme : ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పేద దేశాలను ఆదుకోవడానికి, అభివృద్ధి కొనసాగడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి బ్యాంకులను సంస్కరించి, బలోపేతం చేయాలని జీ-20 కూటమి భావిస్తోంది. విశాల హృదయంతో ఈ బ్యాంకుల ద్వారా పేద దేశాలకు రుణాలు, ఇతర సాయం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనల కోసం భారీగా నిధులు సమకూర్చడంపై.. జీ-20 సదస్సులో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్యాంకులను ఎలా సంస్కరించాలి, రుణాలను ఎలా అందించాలో నిర్దేశించడానికి ఓ అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పేదరికాన్ని తగ్గించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకోసం 2030 కల్లా ఇప్పడిస్తున్న రుణాలను మూడింతలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సాధించాలంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఏటా 500 బిలియన్ డాలర్లు అదనంగా అవసరమని అంచనా. అమెరికా 50 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ముందుకు రాగా.. ఇతర దేశాల నుంచి భారీగా నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు మెుదలయ్యాయి.
మరోవైపు ఆందోళనకరంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి అగ్రరాజ్యాల సాయంపై చర్చలు జరుగుతున్నాయి. కర్బన ఉద్గరాలను తగ్గించడంతోపాటు హరిత సాంకేతికతను అభివృద్ధిచెందుతున్న దేశాలకు అందించడంలో అగ్రదేశాలు నత్తనడక నడుస్తుండటం పట్ల అసంతృప్తి నెలకొంది. ఆర్థిక, సాంకేతిక సాయం చేయకుండా తమను సంప్రదాయేతర ఇంధనంవైపు నడిచేలా ఒత్తిడి తెస్తున్నారని దక్షిణాఫ్రికా, ఇండోనేసియా లాంటి వర్ధమాన దేశాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశాలపైనా జీ20లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్థిక నేరస్థులు ఏ దేశంలో ఉన్నా వారిని కట్టడి చేయడం, అప్పగించడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ఓ ఒప్పందానికి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని భారత్ జీ-20 సభ్యదేశాలపై ఒత్తిడి తెస్తోంది. ఈ అంశంపైనా సదస్సులో చర్చించే అవకాశం ఉంది.
G20 India Ambitions : ప్రపంచ వేదికపై ఛాంపియన్‌గా భారత్! జీ20 సదస్సుతో ఆ లక్ష్యాలు నెరవేరాయా?