Free Bus Ticket For Ladies in Karnataka : కర్ణాటకలోని మహిళలు ఇకపై ఉచితంగా బస్సులో ప్రయాణించొచ్చు. రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగా బస్సులో ప్రయాణించేలా శక్తి పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదివారం విధాన సౌధ వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. పథకం ప్రారంభానికి సూచికగా ఐదుగురు మహిళలకు ఉచిత టికెట్లను అందజేశారు.
శక్తి యోజన నిబంధనలివే
Shakti Scheme Guidelines :
- Karnataka free bus smart card : మహిళలు 'సేవా సింధు' ప్రభుత్వ పోర్టల్ ద్వారా శక్తి స్మార్ట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మూడు నెలల్లో కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది.
- శక్తి స్మార్ట్ కార్డులు జారీ చేసే వరకు లబ్ధిదారులు.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను ఉపయోగించుకుని ప్రయాణించవచ్చు.
- లబ్ధిదారులు కర్ణాటకకు చెందిన వారై ఉండాలి. కేవలం సిటీ, రెగ్యులర్, ఎక్స్ప్రెస్ బస్సులకే ఈ పథకం వర్తిస్తుంది.
- మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా సరకు రవాణా చేస్తుంటే దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
- రాష్ట్రంలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంతర్రాష్ట్ర బస్సులకు ఈ శక్తి పథకం వర్తించదు.
- రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, వజ్ర, వాయు వజ్ర, ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్ ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ వంటి అన్ని లగ్జరీ బస్సులను పథకం నుంచి మినహాయించారు.
Free Bus For Women In Bangalore : బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC), కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC) పరిధిలో నడుపుతున్న బస్సుల్లో ఈ శక్తి పథకం ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. బీఎమ్టీసీ కాకుండా మిగతా మూడు ఆర్టీసీలకు సంబంధించిన బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పింది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి.. ఆయా రోడ్డు ట్రాన్స్ప్రోర్ట్ కార్పొరేషన్లకు రీయింబర్స్మెంట్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అవసరమైన చోట బస్సు సర్వీసులను పెంచుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మూడు నెలల్లో స్మార్ట్ పాసెస్ విడుదల చేస్తామని.. మహిళల గోప్యతకు భంగం కలగకుండా వీటిని జారీ చేస్తామని ఆదివారం చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న పథకంతో 4.18 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి, కార్మిక మహిళలకు ఈ పథకంతో నగదు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. లైంగిక అల్పసంఖ్యాకులూ అర్హులేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,609 బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉచిత ప్రయోజనం కోసం ఏటా రూ.4051.56 కోట్లు ఖర్చు వస్తుందని ప్రభుత్వం అంచనా.
ఇవీ చదవండి : బస్సుల్లో 50% సీట్లు పురుషులకే.. వారికి ఫ్రీ.. ప్రభుత్వం ఆదేశాలు
ఉచిత హామీల అమలుకు కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్రంపై భారం ఎంతంటే?