Vijaya Rama Rao Passed Away in Hyderabad: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుముశారు. బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో.. కుటుంబసభ్యులు నిన్న మధ్యాహ్నం ఆయణ్ను బంజారాహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల లోపల అన్ని భాగాలు దెబ్బతిన్నాయని దీంతో విజయరామారావు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భార్య వసుమతి గతేడాది మృతిచెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు అమెరికాలో ఉండటంతో ఆయన వచ్చాక ఈరోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
36 ఏళ్ల సర్వీసులో.. ఎన్నో ఉన్నతస్థానాలు: సీబీఐకి డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావు.. తన హయాంలో ఎన్నో సంచలనాత్మక కేసుల దర్యాప్తు బాధ్యతలను పర్యవేక్షించారు. 36 ఏళ్ల సర్వీసులో ఎన్నో ఉన్నతస్థానాలు అధిరోహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ మాన్యువల్‌ను పునఃలిఖించారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకూ ఇదే ప్రామాణికంగా మారింది. 1984 నాటి ఆగస్టు సంక్షోభ సమయంలో హైదరాబాద్ కమిషనర్‌గా, ఆర్టీసీ ఎండీగా పనిచేసిన ఆయన పదవులకు వన్నె తెచ్చారు. 1971లో భారత పోలీసు పతకం , 1985లో అత్యుత్తమ సేవలు అందించినందుగాను రాష్ట్రపతి పోలీసు పతకం వరించింది.
సీబీఐ డైరెక్టర్‌గా ఎన్నో సంచలన కేసులు: ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో 1993లో విజయ రామారావు సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. 1996 వరకూ అదే హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలో అనేక సంచలనాత్మక కేసులు నమోదయ్యాయి. అందులో ఇస్రో గూఢచర్యం, జేఎంఎం ముడుపుల ఉదంతం, బాబ్రీమసీదు విధ్వంసం, వంటివి కొన్ని. ఇస్రో గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కీలకమైన పత్రాలు అమ్ముకున్నట్లు.. మాల్దీవులకు చెందిన ఓ మహిళ ఇందులో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కానీ విజయరామారావు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపిన సీబీఐ ఇదంతా కట్టుకథగా తేల్చింది. చివరకు సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది. పీవీ నరసింహారావుపై వచ్చిన జె.ఎం.ఎం. ముడుపుల కేసుపై ఆయన హయాంలోనే దర్యాప్తు జరిగింది. 1996 జూన్‌లో విజయరామారావు పదవీ విరమణ చేశారు.
మంత్రిగా పనిచేశారు: సీబీఐ డైరెక్టర్‌గా పదవీ విరమణ తర్వాత విజయరామారావు టీడీపీలో చేరారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 1999లో పోటీ చేసి.. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డిపై విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆయనకు రోడ్లు భవనాల శాఖ అప్పగించారు. తిరిగి 2004లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.
ఎనలేని సేవలందించారు: విజయరామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలందించారని తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయరామారావు అంత్యక్రియలను.. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారిని కేసీఆర్ ఆదేశించారు.
సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసి.. రాజకీయాల్లోకి వచ్చిన విజయరామారావు ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన విజయరామారావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. సీబీఐ డైరెక్టర్‌గా, మంత్రిగా ఆయన సేవలను ఆయన కొనియాడారు.
ఇవీ చదవండి: తమ్ముడి కోసం అక్క తాపత్రయం.. ఏకంగా క్వశ్చన్ పేపర్ లీక్ చేయించింది
ముస్లింలు లేని గ్రామంలో ఘనంగా ఉర్సు వేడుకలు.. 200 ఏళ్ల ఆచారం!