మహారాష్ట్రలో సింధుదుర్గ్, ఠాణె, పాల్ఘర్, సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల ధాటికి పలువురు మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల గోడలు కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
రహదాలు నదులను తలిపిస్తున్నాయి. దీంతో పలు రోడ్లను అధికారులు మూసివేశారు. ఫలితంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ముంబయిలోని సబర్బన్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
నదుల ప్రవాహం
భారీగా వరద నీరు చేరడం వల్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. చిన్న చిన్న ఆనకట్టలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
మరోవైపు సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ దళాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఠాక్రేతో మాట్లాడిన ప్రధాని
రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గురించి ఆరా తీశారు. రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇంట్లో 'కోబ్రా'ల మకాం.. తవ్వినకొద్దీ బయటకు!