తమిళనాడులో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించారు. కాంచీపురంలోని ఓ బాణసంచా పరిశ్రమలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ బాణసంచా ప్లాంటులో 30 మందికిపైగా పనిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న కాంచీపురం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. ఘటనా స్థలంలోనే నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ మరో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిశ్రమ 20 ఏళ్లకు పైగా బాణసంచా తయారు చేస్తున్నట్లు తెలిపారు.
పాదచారులపైకి దూసుకొచ్చిన కారు.. ముగ్గురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు పాదచారులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదం ఛాంద-కదియాపుర్ రహదారిపై జరిగింది.
ఇదీ జరిగింది
ఛాంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు మృతిచెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతులను సద్కుల్ నిషా (45), మహ్రుల్నిషా (62), ఝబ్బు యాదవ్‌గా (65) గుర్తించారు. గాయపడిన దీపక్ పాండే (35) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాణసంచా ఉన్న ఇంట్లో పేలుడు.. నలుగురు మృతి
తమిళనాడులో అనేక ప్రాంతాల్లో బాణసంచా పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరుచూ పేలుళ్లు జరుగుతాయి. అంతకుముందు నమక్కల్‌లోని ఓ ఇంట్లో బాణసంచా నిల్వ ఉంచగా.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెహనూర్కు చెందిన తిల్లై కుమార్(37) లైసెన్స్ స్థానికంగా బాణసంచా వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడం వల్ల అతడి భార్య, తల్లి అక్కడిక్కడే మృతిచెందారు. కుమార్తె మాత్రం ప్రాణాలతో బయటపడింది. కానీ ఈ పేలుడు ప్రభావంతో అతడి ఇంటి పక్కన ఉన్న ఓ వృద్ధురాలు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి అతడి ఇల్లు ధ్వంసమైంది. అయితే ఘటనకు షార్ట్-సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి : ఒక్కసారిగా కూలిన స్వింగ్ టవర్.. ఎగ్జిబిషన్‌కు వెళ్లిన 40 మందికి..
భూకంపం వేళ మహిళకు డెలివరీ.. ఆస్పత్రి మొత్తం షేక్ అయిపోతున్నా..