Road Accident in Jhunjhunu Rajasthan: రాజస్థాన్ ఝున్ఝునూ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఝున్ఝునూ- గుఢా రోడ్ హైవే వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు.
ఓ ఆలయ దర్శనానికి వెళ్లి.. తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రధానమంత్రి కార్యాలయం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం.. వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
బస్సును ఢీకొని ఆరుగురు: ఉత్తర్ప్రదేశ్ దేవరియాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. పెళ్లి విందుకు హాజరై ఎస్యూవీలో తిరిగొస్తుండగా.. ఆ వాహనం ఓ బస్సును ఢీకొట్టింది. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: దళిత విద్యార్థిని దారుణంగా కొట్టి.. కాళ్లు నాకించి..