1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సారథ్యంలోని ఈస్టిండియా కంపెనీ సేన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్‌పై పట్టు సంపాదించింది. భారత్‌లో తన పాలనకు బీజం వేసింది. ఆస్తికుడైన రాబర్ట్‌క్లైవ్ ఊహించని ఈ విజయానికిగాను దేవుడికి కృతజ్ఞత తెలపాలనుకున్నాడు. కానీ అక్కడున్న ఒకేఒక చర్చిని అప్పటికే సిరాజుద్దౌలా కూల్చేశాడు. చర్చి లేని కారణంగా... ఆ సమయంలో దుర్గామాతకు పూజచేసి(durga puja celebration) విజయోత్సవం జరుపుకోవాలని క్లైవ్‌కు సూచించాడు ఆయన సహాయకుడైన జమీందార్ నబాకృష్ణదేవ్. తన శోభాబజార్ బంగళాలో దుర్గామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇవాల్టికీ కృష్ణదేవ్ వారసులు శోభాబజార్‌లో 'కంపెనీ పూజ' పేరిట ఏటా ఉత్సవాలు కొనసాగిస్తుండటం విశేషం!
అలాగని తెల్లవారి రాకతోనే దుర్గా ఉత్సవాలేమీ(durga puja celebration) ఆరంభం కాలేదు. అంతకుముందు ఇళ్లకే పరిమితమైన ఈ ఉత్సవం క్రమంగా సామాజిక రూపం దాల్చటం కీలక పరిణామం. ఈస్టిండియా రాకతో బెంగాల్‌లో కీలకభూమిక పోషించిన జమీందార్లు, సంపన్నులు తమ ఆధిపత్యాన్ని, ప్రభుత్వంలో పట్టును, దర్పాన్ని చాటడానికి ఈ ఉత్సవాలను వేదికలుగా చేసుకున్నారు. ప్రజలందరికీ భారీస్థాయిలో దానాలు చేసేవారు. తమ అధికారానికి కూడా ఈ ఉత్సవాలు దోహదం చేస్తుండటంతో ఈస్టిండియా కంపెనీ అధికారులూ ప్రోత్సహించారు. గవర్నర్ జనరల్ లార్డ్ వెస్లీ కాళీమాతకు గౌరవ ప్రదంగా తొమ్మిది తుపాకుల శాల్యూట్‌ను ప్రవేశపెట్టారు.
అలా జమీందార్ల పర్యవేక్షణలో సాగిన దుర్గా పూజ జాతీయోద్యమం(Indian independence movement) ప్రభావంతో సామాన్య ప్రజల ఉద్యమంగా(Azadi ka Amrut Mahotsav) మారింది. 1919లో జమీందార్లకు సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం దుర్గాపూజ నిర్వహించింది. దీన్ని బరోయారి (12 మందితో చేసిన) పూజ అంటారు. బాగ్‌బజార్‌లో సర్వజనపూజ మొదలైంది. వీటిలో క్రమంగా జాతీయోద్యమ నాయకులు, విప్లవనాయకులు కూడా ప్రవేశించారు. 1930లో కోల్‌కతా మేయర్‌గా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్వజన పూజను ముందుండి నడిపించారు. జాతీయోద్యమ ప్రచారానికి, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహానికి ఈ ఉత్సవాలు వేదికగా మారాయి. విప్లవబాటను నమ్మేవారు కూడా ఈ ఉత్సవాలను తమ లక్ష్యాల సాధనకు వాడుకున్నారు. అనుశీలన్ సమితి సభ్యులు... సిమ్లాబాయమ్ సమితి పేరుతో ఉత్సవాలు నిర్వహించి.... అందులో భాగంగా యువతకు కర్రసాము తదితర మిలిటరీ శిక్షణ ఇచ్చేవారు. దీంతో.. బ్రిటిష్ ప్రభుత్వం 1932లో ఈ సమితిపై నిషేధం విధించింది. ఎక్కడున్నా ఈ ఉత్సవాల సమయానికి బెంగాలీలంతా తమ ఇళ్లకు చేరేవారు. కుటుంబాల్లో ఎన్ని విభేదాలున్నా ఈ సమయానికి అవన్నీ మరచి కలసిపోయేవారు. ముస్లింలు కూడా ఈ ఉత్సవాల్లో భాగమవటం వీటి ప్రత్యేకత.
ఇదీ చూడండి: భారతీయులకు 'స్వాతంత్య్రం' రుచి చూపిన గణపతి!