తమిళనాడులో అధికార డీఎంకే సర్కారుకు, గవర్నర్‌కు మధ్య ఘర్షణకు అసెంబ్లీ వేదికైంది. శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రారంభోపన్యాసంపై వివాదం చెలరేగింది. ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగంలోని పలు అంశాలను గవర్నర్ ఆర్.ఎన్. రవి చదవకుండా వదిలివేశారు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం.. ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. ఈ పరిణామం నేపథ్యంలో గవర్నర్.. సభ నుంచి వాకౌట్ చేశారు. ఇలా సభ నుంచి గవర్నర్ వెళ్లిపోవడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది.
ఈ ఏడాది ఇవే తొలి శాసనసభ సమావేశాలు కాబట్టి గవర్నర్ ప్రారంభ ఉపన్యాసం చేయడం ఆనవాయితీ. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలోని పలు అంశాలను గవర్నర్ వదిలేశారు. 'ద్రవిడియన్ మోడల్' అనే పదాన్ని ఆయన పలకలేదు. పెరియార్ రామస్వామి, అన్నాదురై వంటి ఉద్యమకారుల పేర్లను ప్రస్తావించలేదు. ప్రసంగ ప్రతిలో లేని అంశాలపై మాట్లాడారు. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగ ప్రతిలో ఉన్న అంశాలను మాత్రమే గవర్నర్ ప్రసంగంగా రికార్డు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ రవి వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది.
అంతకుముందు, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ సభ్యులు పదేపదే నినాదాలు చేశారు. 'తమిళనాడు జిందాబాద్', 'మా నేల తమిళనాడు' అంటూ నినదించారు. ఆర్ఎస్ఎస్, భాజపా భావజాలాన్ని రాష్ట్రంపై రుద్దకూడదంటూ డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రసంగంలోని అంశాలను దాటవేసి గవర్నర్.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ మండిపడింది. తనను నియమించిన వారికి అనుకూలంగా నడుచుకుంటున్నారని ఎద్దేవా చేసింది. గవర్నర్ పదవికి ఆయన మచ్చ తెస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు.
అండగా భాజపా..
సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 'గెట్అవుట్ రవి' అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. ఆర్.ఎన్. రవిని గవర్నర్ పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని భాజపా మాత్రం గవర్నర్‌కు మద్దతుగా నిలిచింది. సభలో ఉన్నప్పుడే గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను అగౌరవపర్చారని సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌భవన్ సమ్మతి తీసుకోకుండానే ప్రసంగాన్ని సిద్ధం చేశారని ఆరోపించింది.
తమిళనాడు పేరును 'తమిళగం'గా మార్చాలని ఇటీవల గవర్నర్ రవి ఓ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. దేశంలో తమిళనాడు అంతర్భాగం కాదనే వాదనను ద్రవిడ ఉద్యమకారులు సృష్టించారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వల్లే తమిళనాడు దేశంలో కలిసి ఉందని 50ఏళ్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనా సభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు పేరును ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.