Dhulipalla Narendra on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) వ్యవహారంలో చట్ట విరుద్ధంగా పనిచేసిన ఉన్నతాధికారులకు ఎంపీ పదవులను హామీ ఇచ్చారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ధూళిపాళ్ల.. చంద్రబాబు పేరు చెప్పాల్సిందిగా స్కిల్ కేసులో నిందితులను విజయసాయి ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టం: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) 20 నెలల విచారణ చేశారని ధూళిపాళ్ల తెలిపారు. కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని వారికి తెలుసని.. కొందరు అధికారులకు రాజకీయంగా పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆ అధికారులు ఉద్యోగం వదిలి ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని అన్నారు. ఈ కేసులో ఎవరైతే తప్పుడు విధానంలో వ్యవహరిస్తారో.. వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.
జగన్ సహా అధికారులు బలి కావడం ఖాయం: గతంలో శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్‌లు జైలుపాలయ్యారని ధూళిపాళ్ల గుర్తు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకో.. జగన్ సహా అధికారులు బలి కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు డబ్బులు వచ్చినట్లు ఈడీ నిర్ధరించలేదని.. ఈడీ దర్యాప్తులో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావన లేదే (Fake Cases on Chandrababu Naidu) అని నిలదీశారు.
విజయసాయిరెడ్డి ప్రలోభ పెట్టారు: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పేరు చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రలోభ పెట్టారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. విజయసాయిరెడ్డి పుణె వెళ్లి 25 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్లు ఎవరూ చెప్పలేదని తెలిపారు.
కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు: ఉన్నతాధికారుల కమిటీ గుజరాత్ వెళ్లి పరిశీలించి నివేదించారని చెప్పారు. నివేదిక మేరకు నిధులు విడుదల చేస్తే చంద్రబాబుకు ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ లాయర్ 10 పేజీల నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థ కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.
డబ్బులు తీసుకుంటారు గానీ సంబంధం లేదంటారా?: సీమెన్స్‌కు 70 కోట్ల రూపాయలు ముట్టినట్లు సీఐడీ చీఫ్ చెప్పారని.. డబ్బులు తీసుకుంటారు గానీ సంబంధం లేదంటారా అంటూ మండిపడ్డారు. తమకు సంబంధం లేనపుడు సీమెన్స్ సంస్థ డబ్బులు ఎలా తీసుకుందని అన్నారు. బురద జల్లడంలో భాగంగా సీఐడీ చీఫ్ (AP CID Chief Sanjay) దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమెన్స్ ఇండియా సంస్థ ప్రతినిధులను బెదిరించి సీఐడీ లేఖ తీసుకుని ఉండొచ్చని వెల్లడించారు.