Mansukh Mandaviya loksabha: కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా.. లోక్‌సభ వేదికగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతపై రాజకీయాలు చేయడం ఆపి.. కేంద్రం చేపట్టిన చర్యలను తెలుసుకోవాలని హితవు పలికారు.
డిమాండ్‌కు తగ్గట్టు.. ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం అన్ని విధాలుగా కృషి చేసిందని.. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మాండవీయ వెల్లడించారు.
"ఆక్సిజన్ కొరతపైనా రాజకీయాలు చేయడం దారుణం. ప్రభుత్వం చేసిన కృషిని విపక్షాలు తెలుసుకోవాలి. ఆక్సిజన్ కొరతతో మరణించిన వారి వివరాలను దాచాల్సిన అవసరం లేదని.. నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రుల సమావేశంలో స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. ఇదే విషయంపై రాష్ట్రాలకు కేంద్రం మూడుసార్లు లేఖ కూడా రాసింది. 19 రాష్ట్రాలు స్పందించాయి. పంజాబ్ మాత్రమే నాలుగు మరణాలు సంభవించినట్టు అనుమానం వ్యక్తం చేసింది. దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇవన్నీ బహిరంగంగానే జరిగాయి. అయినా రాజకీయాలు చేస్తున్నారు."
--మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.
కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై ఎలాంటి సమాచారం లేదని వర్షాకాల సమావేశంలో రాజ్యసభకు వెల్లడించింది కేంద్రం. దీనిపై అప్పట్లో విపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ఎంపీ సురేశ్ ధనోకర్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆరోగ్యమంత్రి మాట్లాడారు.
ఇదీ చూడండి:- 'ఆక్సిజన్ కొరతతో మీ రాష్ట్రంలో ఎవరైనా చనిపోయారా?'