రాజస్థాన్‌లోని డుంగార్పూర్లో విషాదం నెలకొంది. 15 ఏళ్ల బాలిక.. తాను దశ మాత అమ్మవారి అవతారాన్ని అని చెబుతూ కత్తితో వీరంగం సృష్టించింది. ఈ క్రమంలో తన ఏడేళ్ల చెల్లిని గొంతును కత్తితో కోసేసింది. దీంతో అక్కడిక్కడే చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని చిటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని జింజ్వా ఫాలా గ్రామంలో శంకర్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో దశ మాత అమ్మావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేస్తున్నాడు. అమ్మవారి రూపం కేవలం రాత్రి సమయంలోనే కనిపిస్తుందంటూ నమ్మే ఆ గ్రామ ప్రజలు.. ప్రతిరోజు రాత్రి సమయంలోనే దర్శనం చేసుకుంటారు. అలాగే ఆదివారం రాత్రి కూడా 8 గంటలకు గ్రామస్థులు వచ్చి.. అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
అదే సమయంలో శంకర్ కుమార్తె.. అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న కత్తిని తీసుకుని హల్చల్ చేసింది. తాను అమ్మవారి అవతారం అని.. అందర్నీ చంపేస్తానంటూ బెదిరించింది. ఇంటి ఆవరణలో కత్తి పట్టుకుని అటు ఇటు పరిగెత్తింది. ఆమెను పట్టుకునేందుకు శంకర్‌తో పాటు అతడి అన్నయ్య సురేశ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారిని కూడా ఆమె గాయపరిచింది. దీంతో ఒక్కసారి శంకర్ కుటుంబసభ్యులంతా పరుగులు తీశారు.
సురేశ్ కుమార్తె పుష్ప(7) మాత్రం ఇంట్లోనే నిద్రిస్తోంది. అక్కడికి వెళ్లిన శంకర్ కుమార్తె కత్తితో పుష్పను గొంతు కోసింది. అంతటితో ఆగకుండా కత్తితో పలు మార్లు పొడిచింది. దీంతో అక్కడిక్కడే ఆమె చనిపోయింది. కాసేపటికి శంకర్ కుటుంబసభ్యులంతా వచ్చి చూసేసరికి పుష్ప విగతజీవిగా కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవీ చదవండి: దళిత మహిళపై లైంగిక వేధింపులు.. తుపాకీతో బెదిరించి..
ఘోరం.. కరెంట్ షాక్‌తో 10 మంది మృతి.. వ్యాన్‌లోని డీజే సిస్టమ్ వల్లే!