ప్రతి సమస్యకు సంగీతం ఒక ఔషధంగా పని చేస్తుందని చెబుతుంటారు. నృత్యాలు చేయటం, పాటలు వినటం చేస్తే మనలోని అంతర్గత శక్తి రెట్టింపవుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది. శారీరక, మానసిక ధృడత్వం కోసం చాలా మంది వైద్యులు డ్యాన్స్ చేయాలని, పాటలు వినమని సూచిస్తుంటారు. అలాంటి దారిలోనే వెళ్తున్నారు రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన ఓ వైద్యుడు. తనదైన శైలిలో రోగులకు చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తన వద్దకు వచ్చే వారికి నృత్యాలు చేయమని సూచిస్తుంటారు. వారితో పాటు కాలు కదుపుతారు కూడా. ఓ వైపు డ్యాన్స్ చేస్తూనే.. వైద్యం అందించటం ఆయన ప్రత్యేకత. ఆయనే.. జోధ్‌పుర్‌కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజ్ ధారీవాల్.
71 ఏళ్ల వయసులోనూ.. వృత్తి రీత్యా చిన్నపిల్లల వైద్యుడైన డాక్టర్ రాజ్ ధారీవాల్ మనస్తత్వం సైతం చిన్న పిల్లల మాదిరిగానే ఉంటుంది. చిన్నారుల మనుసులో చాక్లెట్, ఐస్‌క్రీమ్ వంటివి మెదులుతున్నట్లే.. ఈ వైద్యుడి మనసులో డ్యాన్స్ ఉంటుంది. 71 ఏళ్ల వయసులోనూ ఎంతో ధృడంగా ఉంటారు. ప్రతిరోజు నృత్యం చేస్తానని, దాని వల్లే తన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికీ రోజులో 10గంటలు తన వద్దకు వచ్చే రోగులకు చికిత్స అందిస్తుంటారు ధారీవాల్. వైద్యంతో పాటు అనారోగ్యానికి గురైన చిన్నారులు నిత్యం డ్యాన్స్ చేయాలని సూచిస్తుంటారు. వారికి డ్యాన్స్ నేర్పించేందుకు సైతం ఇష్టపడతారు.
డ్యాన్సింగ్ డాక్టర్: వివాహ వేడుకల్లో వేదికపైన నృత్యాలు చేస్తుంటారు చేస్తుంటారు డాక్టర్ ధారీవాల్. 71 ఏళ్ల వయసు వచ్చినా శారీరకంగా ధృడంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఈ కారణంగానే ఆయన జోధ్‌పుర్‌లో 'డ్యాన్సింగ్ డాక్టర్'గా పేరుగాంచారు. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. అందులో ఓ పాత సినిమా పాటకు ఆయన పెళ్లి వేదికపై నృత్యం చేశారు. ప్రతి రోజు ఉదయపు నడక, వ్యాయామం, యోగాలతో పాటు ఒక గంట పాటు నృత్యం చేస్తానని చెబుతున్నారు ధారీవాల్.
డాక్టర్ ధారీవాల్కు ముగ్గురు కుమారులు. వారంతా ఐఐటీల్లో చదివారు. తన కోడలితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం తమ నిత్యజీవితంలో డ్యాన్స్‌ను ఒక భాగం చేసుకున్నారు. ఆయనకు కొద్ది రోజుల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం మధుమేహం, ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం, యోగా, నృత్యాలతో పాటు పంచదార, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు.. భావోద్వేగంతో కంటతడి