లాటరీలలో లక్షలు కోట్లు గెలుచుకున్న వ్యక్తుల గురించి వార్తల్లో అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. ఒక్క లాటరీ గెలిస్తే చాలు జీవితంలో స్థిరపడిపోవచ్చు అనుకునే వారే లాటరీ టికెట్లను కొంటుంటారు. అదృష్టం కలిసిరాకపోతే కొద్ది రోజులకు ఆ ఆసక్తి చాలా మందిలో తగ్గిపోతుంది. కేరళలోని కన్నౌర్‌కు చెందిన రాఘవన్ మాత్రం 52ఏళ్లుగా లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నాడు. రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున కొంటున్న రాఘవన్ ఇందుకోసం ఏకంగా 3కోట్ల50లక్షలు రూపాయలు ఖర్చు చేశాడు. ఇంతా చేసి ఇప్పటివరకు లాటరీల్లో రాఘవన్ గెలుచుకున్న గరిష్ఠ బహుమతి 5వేల రూపాయలు మాత్రమే.
అదృష్టాన్ని నమ్ముకున్న రాఘవన్ దానితోనే సరిపెట్టుకుని కూర్చోలేదు. కూలీ పనులు చేస్తూనే అందులో వచ్చే కొంతమొత్తాన్ని లాటరీ టికెట్ల కోసం ఖర్చు చేస్తున్నాడు. కేరళలో అత్యంత ఖరీదైన ఓనమ్ బంపర్ లాటరీని కూడా అతడు కొనుగోలు చేశాడు. ఆ టికెట్లన్నీ భద్రంగా గోనె సంచుల్లో నిల్వ చేసి అదృష్టం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు.
మధ్యతరగతి జీవనం వెళ్లదీస్తున్న రాఘవన్ లాటరీల కోసం 3కోట్ల 50లక్షల వృథా చేసినా వాటిని కొనడం మానుకోను అని తెగేసి చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి కూడా అతనికి సంపూర్ణ మద్ధతు లభిస్తోంది. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది. మొట్టమొదటి లాటరీని 1970లో 18ఏళ్ల వయసులో కొనుగోలు చేసినట్లు చెప్పాడు రాఘవన్.
మరోవైపు.. కేరళ తిరువనంతపురానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇటీవల జాక్‌పాట్ కొట్టాడు. ఓనం బంపర్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. శనివారం టికెట్ కొన్న అతడికి ఆదివారమే భారీ జాక్‌పాట్ దక్కడం విశేషం. ఆటో డ్రైవర్‌గా పనిచేసే అనూప్.. శ్రీవహారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. శనివారం టికెట్ కొనేందుకు వెళ్లిన అతడు.. తొలుత వేరే టికెట్‌ను తీసుకున్నాడు. ఏమనిపించిందో ఏమో గానీ.. తర్వాత ఆ టికెట్‌ను వెనక్కి ఇచ్చేసి వేరే టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే టికెట్ రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది. అనూప్ జాక్‌పాట్ కథ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే అసలు ఈ లాటరీ టిెకెట్లు మనం కూడా కొనచ్చా? రూల్స్ ఏంటి? వంటి వివరాలు తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.