నివర్ అతి తీవ్ర తుపానుగా తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా దూసుకువస్తోంది. సముద్రంలో అనువైన ఉష్ణోగ్రతలు , గాలిలో తేమ అందుబాటులో ఉండటం వల్ల అంతకంతకూ బలపడుతూ తీరం వైపుగా వస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం సాయంత్రం కరైకల్, మామళ్లపురం(మహాబలిపురం) మధ్య తీరాన్ని తాకుతుందని, ఆ సమయంలో గాలుల ఉద్ధృతి గంటకు 120-145 కి.మీ. ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తుపాను తీరం దాటే సమయంతో పాటు 26, 27న సైతం తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఆంధ్ర ప్రదేశ్లోని దక్షిణ కోస్తాంధ్ర , రాయలసీమ జిల్లాల్లో, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుపాను తీరం దాటినప్పటికీ 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ కర్ణాటకపైనా కొంత వరకు ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన గజ కంటే నివర్ ప్రభావం తక్కువగానే ఉంటుందని చెన్నై వాతావరణ డైరెక్టర్ బాలచంద్రన్ ప్రకటించారు.
ఫోన్లో మాట్లాడిన మోదీ...
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో ఫోన్లో మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తమిళనాడు వ్యాప్తంగా అత్యవసర విభాగాల ఉద్యోగులకు మినహా మిగిలిన వారికి బుధవారం ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. పుదుచ్చేరిలోనూ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. చెన్నైలో సబర్బన్ సహా దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. ఏడు జిల్లాల్లో ఇప్పటికే ప్రజా రవాణా నిలిపివేశారు.
ప్రాణనష్టం లేకుండా...
రాష్ట్రాలకు పలు విధాలుగా సహాయం చేస్తామని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) వెల్లడించింది. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు.
ఇదీ చదవండి:కరోనా పంజా.. దిల్లీలో మరో 6వేల కేసులు