Mumbai to Hyd cycling: మహారాష్ట్ర నవీముంబయి ఖార్‌ఘర్‌కు చెందిన నిహారిక రెడ్డి(16) ముంబయి-హైదరాబాద్ సైకిల్ యాత్రను మూడు రోజుల్లో పూర్తిచేసి అందరిచేత ఔరా అనిపించుకుంది. శుక్రవారం ఖార్ఘర్లో బయలుదేరిన ఆమె.. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
3 రోజులు.. 700 కి.మీ..
Cycling Niharika: 'కల ఏదైనా.. సాకారం సాధ్యం! తొలి అడుగే కీలకం!!' అని సందేశం ఇచ్చే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టింది నిహారిక. శ్రీధర్, ప్రభాకర్ బోనం, విజయ్ పాటిల్, భాస్కర్ అనే మరో నలుగురు సైక్లిస్ట్‌లు ఆమెకు తోడయ్యారు. శుక్రవారం వేకువజామున 3.45గంటలకు నిహారిక బృందం ఖార్ఘర్లో యాత్ర ప్రారంభించింది. నిహారిక తండ్రి, మరికొందరు వారిని కారులో అనుసరిస్తూ.. అవసరమైన సాయం అందించారు.
Cyclist Niharika Muchintal:
నిహారిక బృందం రోజుకు దాదాపు 200-250కిలోమీటర్లు సైక్లింగ్ చేసింది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల శనివారం ఆమె కాస్త ఇబ్బంది పడినా.. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గమ్యస్థానం చేరేవరకు పట్టువిడవకుండా ముందుకుసాగింది.
సరదాగా మొదలై..
నిహారిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి సరదా కోసం సైకిల్ తొక్కుతున్నా.. రెండేళ్ల క్రితమే ఆమెకు దీనిపై మక్కువ పెరిగింది. కోచ్ సాయంతో ప్రొఫెషనల్ సైక్లింగ్‌పై దృష్టిపెట్టింది. రోజూ 50 కిలోమీటర్లు, వారాంతాల్లో 100 కి.మీ సైక్లింగ్ చేయడం మొదలుపెట్టింది.
"చదువుకు, సైక్లింగ్‌కు సమప్రాధాన్యం ఇచ్చేందుకు మొదట్లో ఇబ్బందిపడ్డా. కానీ కొన్ని వారాల్లోనే ఆ సమస్యను అధిగమించా. సైక్లింగ్.. స్ట్రెస్ బస్టర్. సైక్లింగ్ చేయడం వల్ల మా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా చదువుపై మరింత దృష్టిపెట్టగలుగుతున్నా. ఈ 708కి.మీ సైకిల్ యాత్ర.. ఇప్పటివరకు నేను చేసిన అతి పెద్ద రైడ్. ఈ యాత్ర.. నా కోచ్ సుధాకర్ రెడ్డికి అంకితం. ఆయన, మా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే నేను ఇక్కడివరకు రాగలిగేదాన్ని కాదు" అని చెప్పింది నిహారిక.
ఇదీ చదవండి: అంధుడి సాహసం.. 7,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర!