Protest in Khammam ON Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఓ వైపు ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతుండగా.. తెలంగాణలోనూ నిరసన సెగ అంటుకుంది. సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోనూ తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కాయి. చంద్రబాబు అరెస్టు అక్రమం, అన్యాయమంటూ నినదించాయి. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ ఆందోళనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. బాబు అరెస్టు(CBN Arrest) అక్రమమంటూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో నిరసనలు పెల్లుబికాయి. చంద్రబాబుకు అండగా ఖమ్మం వాసులు పోటెత్తారు. బాబు కోసం మేము సైతం అంటూ... పార్టీలకు అతీతంగా కదం తొక్కారు. సుమారు 4 గంటలపాటు 4 కిలోమీటర్లకు పైగా సాగిన భారీ ర్యాలీలో... మహిళలు, ఐటీ ఉద్యోగులు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జైబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. విజనరీ నేతను అరెస్టు చేయడం దారుణమని... వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అరెస్టుపై ఖమ్మం ఖిల్లా భగ్గుమంది. బాబుకు బాసటగా అభిమానులు కదం తొక్కారు. చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మయూరి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. దాదాపు 4 కిలోమీటర్లు సాగిన ర్యాలీలో వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా మహిళలు రోడ్డుపైకి వచ్చి బాబుకు సంఘీభావం ప్రకటించారు. ఐటీ ఉద్యోగులు, యువత నల్లజెండాలు, ప్లకార్డులతో తరలివచ్చారు. దాదాపు 4 గంటలపాటు జైబాబు నినాదాలతో ఖమ్మం దద్దరిల్లింది. సైకో పోవాలి... బాబు రావాలి అంటూ నినదించారు.
ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మహిళలు మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధికి బాటలు వేసిన మహానేతను జైల్లో పెట్టడం సబబు కాదని ఆక్షేపించారు. కేంద్రం జోక్యం చేసుకుని... చంద్రబాబును విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఖమ్మంకు చెందిన ఐటీ ఉద్యోగులు(IT Employees) కూడా తరలివచ్చి బాబుకోసం మేము సైతం అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు విజన్‌తోనే తాము మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డామని తెలిపారు. బాబును జైల్లో పెట్టడం అంటే... అభివృద్ధి, సంక్షేమానికి సంకెళ్లు వేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ఎన్టీఆర్ (NTR) మనవడు చైతన్య కృష్ణ పాల్గొన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే బాబును అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.
భారీ ర్యాలీకి ఖమ్మం నగరంతోపాటు జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం అభిమానులు కదిలొచ్చి బాబుకు అండగా నిలిచారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ చౌరస్తా వద్ద వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబును విడుదల చేయాలంటూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.