CM YS Jagan Meeting With YCP Leaders: వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితా కొలిక్కి వచ్చింది. కాసేపట్లో రెండో జాబితా విడుదల చేయనున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించి ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేశారు. పలువురు ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేసిన సీఎం జగన్, 20-25 మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో వైసీపీ రెండో జాబితా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పు ఉండనుంది. అదే విధంగా ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో సైతం మార్పు ఉండనుందని సమాచారం. మిగతా స్థానాలపై కసరత్తు చేశాక సీఎం జగన్ మూడో జాబితా విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై కసరత్తు జరిగింది. సీఎం జగన్ పిలుపుతో గత కొన్ని రోజులుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలి వచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి పిలుపుతో సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.
కాపు ఓట్లు జారిపోకుండా వైఎస్సార్సీపీ వ్యూహం - వంగవీటి రాధ, ముద్రగడకు పార్టీలోకి ఆహ్వానం
విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, చిత్తూరు జిల్లా సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు గోదాసరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పల్గుణ, పొన్నూరు ఎమ్మేల్యే కిలారు రోశయ్య వచ్చారు. గిద్దలూరు సీటు ఆశిస్తోన్న మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
వీరితో సమావేశమైన సీఎం జగన్ సీటు విషయమై స్పష్టత ఇచ్చారు. అభ్యర్థిని మార్చితే ఆ విషయాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు చెబుతూ త్యాగం చేయాలని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తానని చెబుతున్నారు. కొందరిని మరో స్థానం నుంచి పోటీకి సిద్దం కావాలని సీఎం సూచించారు. పార్టీ రీజినల్ ఇన్ఛార్జిలు, సీఎం జగన్ను కలసిన పలువురు ఎమ్మెల్యేలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇన్‌ఛార్జ్‌ల మార్పులు ఖరారు చేసిన స్థానాల జాబితాను నేడు విడుదల చేయనున్నారు.
మరోవైపు కాపు సామాజికవర్గం ఓట్లపై కూడా వైసీపీ కన్నేసింది. ఇందుకోసం ఆ సామాజికవర్గం కీలక నేతలైన వంగవీటి, ముద్రగడ కుటుంబాలను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు చూస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధకు స్నేహితుడైన కొడాలి నాని ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. అదే విధంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీచేస్తానని ముద్రగడ పద్మనాభం చెప్పడంతో, ఆయనతో చర్చలు జరుపుతున్నారు.
వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవోకి ప్రజాప్రతినిధులు 'క్యూ'