జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటనం వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు.. దోడా జిల్లాను అతలాకుతులం చేశాయి. వరద ధాటికి చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆకస్మిక వరదలలో పాఠశాల భవనం సహా 13 భవనాలు కొట్టుకుపోయాయని.. మరో 20 భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని.. అధికారులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కహారా టూరిజం సెంటర్, భదర్వా డెవలప్‌మెంట్ అథారిటీ కూడా నీట మునిగాయని తెలిపారు. ఆకస్మిక వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదని తెలిపారు.
దోడా జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని.. అధికారులు తెలిపారు. రెడ్‌క్రాస్ సంస్థ సత్వర ఉపశమనంగా.. కొన్ని నిత్యావసర వస్తువులు అందించిందని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వాగులు, నదుల్లో నీటి మట్టం పెరుగుతోందని ఆకస్మిక వరదలు సంభవించే భయాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చీనాబ్ నది పరిసరాల్లో జీవించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బారాముల్లా జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి రఫియాబాద్లోని కండీ సహా హమమ్ మర్కోట్ ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. భారీగా పంటనష్టం జరిగిందని తెలిపారు.
ఇదీ చూడండి : లారీతో ఢీకొట్టి మరో పోలీసు హత్య.. గంటల వ్యవధిలో ముగ్గురు బలి