బిహార్లోని భాగల్పుర్ రైల్వే స్టేషన్లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. తన తల్లి చనిపోయిందని తెలియని ఓ బాలుడు.. ఆమె మృతదేహంపైనే తలపెట్టి పడుకున్నాడు. 'అమ్మా ఆకలేస్తోంది.. లే' అంటూ ఏడుస్తూ అక్కడే కుర్చున్నాడు. అలా సుమారు ఐదు గంటల సేపు తల్లి మృతదేహం దగ్గరే గడిపాడు ఆ బాలుడు. కొన్ని గంటల తర్వాత సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. బాలుడి తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పిల్లవాడిని శిశు సంరక్షణ కేంద్ర అధికారులకు అప్పగించారు.

"సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాలుడి తల్లి మృతి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఆ సమయంలో చాలా మంది చూసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకి మా దృష్టికి వచ్చింది. వెంటనే వెళ్లి పరిశీలించగా బాలుడి తల్లి చనిపోయిందని తెలిసింది. వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించాం. శిశు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించి బాలుడ్ని అప్పగించాం."
-- జీఆర్పీ పోలీసులు
అయితే బాలుడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని, రాత్రంతా హెల్ప్డెస్క్లోనే ఉంచామని శిశు సంరక్షణ కేంద్ర అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. డాక్టర్లు వైద్య పరీక్షలు జరిపి, మందులు ఇచ్చారన్నారు.

ఇవీ చదవండి: 15 ఏళ్లకు నరకకూపంలోకి.. 4 నెలల్లో మూడు సార్లు అమ్ముడుపోయి...