మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లా నారాయణ్‌పుర్ గ్రామంలో బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడ్ని సహాయక సిబ్బంది సురక్షితంగా వెలికితీశారు. 30-40 అడుగుల లోతులో ఉన్న అతడ్ని 8 గంటలు పాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డ ప్రాణాలతో బయటకు రావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో ఆడుకుంటూ దీపేంద్ర అనే బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అతను కనిపించకపోవడం చూసి ఆ ప్రాంతమంతా వెతికారు కుటుంబసభ్యులు. ఆ సమయంలో బోరుబావిలో నుంచి బాలుడి అరుపులు వినిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు సహాయక సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పొక్లెన్ సాయంతో 30-40 ఫీట్లు తవ్వి బాలుడ్ని బయటకు తీశారు.