Chandrababu to Rajamahendravaram Hospital: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనను ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం సర్వజనాసుపత్రిలోని వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా శుక్రవారం అర్ధరాత్రి సిద్ధం చేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. క్యాజువాలిటీ పక్కనున్న గది, మార్గం అంతా హడావుడిగా శుభ్రం చేశారు. రూమ్‌లో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు.
ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్‌తో పాటు ఇద్దరు క్యాజువాలిటీ వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఇటీవల డీహైడ్రేషన్, అలర్జీలతో బాధపడుతున్నారు.
Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు
గురువారం జీజీహెచ్ నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్య నిపుణులు చంద్రబాబును పరీక్షించి కొన్ని మందులు సూచించారు. దీంతో సీల్డ్ కవర్‌లో సమగ్ర రిపోర్టు జైలు ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వద్దని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
అదే సమయంలో ప్రభుత్వాసుపత్రిలో వీఐపీ గదిని ఆగమేఘాలపై సిద్దం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ డాక్టర్ల సూచనల మేరకు చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సి వస్తే.. ముందు జాగ్రత్త చర్యగా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై వైద్యవర్గాల వద్ద ప్రస్తావించగా ఎటువంటి స్పష్టత ఇవ్వడంలేదు. సిబ్బంది వద్ద ఆరా తీయగా ఓ వీఐపీ వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారని చెబుతున్నారు.
Chandrababu's Health in Jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
మొదటనుంచీ పలు అనుమానాలు: చంద్రబాబు ఆరోగ్యంపై (Chandrababu Health) మొదటనుంచీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడంతో పాటు.. అనంతరం శరీరంపై పలుచోట్ల దద్దుర్లు రావటం, అలర్జీతో బాధపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందిస్తున్న తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబు గురించి టీడీపీ నేతలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోగా.. కొందరు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి.
దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, అదే విధంగా లోకేశ్, బ్రాహ్మణి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు అత్యవసర వైద్యాన్ని సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టెరాయిడ్లు ప్రయోగించడానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం యత్నిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించగా.. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు.