Chandrababu Released from Rajahmundry Central Jail : బాబొచ్చాడు... చంద్రబాబు వచ్చాడు. అభిమాన నేత రాకతో రాజమండ్రికి, రాష్ట్రానికి పండగొచ్చింది. అభిమానం పోటెత్తింది. జనసంద్రం ఉరకలెత్తింది. అశేష అభిమాన లోకానికి, అఖండ స్వాగతం పలికిన నాయకగణానికి అభివాదం చేసిన చంద్రబాబు.. తనపట్ల ఇంతటి అభిమానం చూపిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. పనిచేసిన నాయకుడిని గుండెల్లో పెట్టుకున్న తెలుగు ప్రజల అభిమానం మరువలేనంటూ అభివందనం తెలియజేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 52 రోజుల తర్వాత బయటికొచ్చారు. చంద్రబాబు రాకతో రాజమండ్రిలో అభిమానం ఉప్పొంగింది. జైలు పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఆ ప్రాంతమంతా జనజాతరను తలపించింది.
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమాన జనతరంగం.. పోలీసు నిబంధనలను పక్కనబెట్టి జైలు ప్రధానద్వారం వద్దకు దూసుకొచ్చారు. ఆయన రావడానికి గంట ముందునుంచే జైచంద్రబాబు నినాదాలతో హోరెత్తించిన జనసందోహం.. అధినేతను చూడగానే ఆనందపారవశ్యానికి లోనయ్యారు. జైబాబు.. జైజై బాబు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించారు. ఒక్కసారి చంద్రబాబును చూస్తే చాలు అన్నంతగా ఆయన కోసం ఎగబడ్డారు.
"అన్న ఎన్టీఆర్" వాక్కులను నిజం చేస్తూ... ఆకాశానికి చిల్లు పడిందా, భూమి బద్ధలైందా అన్నట్లుగా జనసునామీ పోటెత్తింది. జైలు పరిసరాలను ముంచెత్తిన అభిమానగణాన్ని అదుపు చేయడం... పోలీసులు, భద్రతా బలగాలకు కష్టసాధ్యమైంది. చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.... భావోద్వేగంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మహిళలు వీరతిలకం దిద్ది "జయము జయము చంద్రన్న" అంటూ శుభకామనలు తెలియజేశారు.
కొండంత అభిమానంతో అశేషంగా తరలివచ్చిన నాయకులు, అభిమానులు, ప్రజానీకానికి... విజయసంకేతం చూపుతూ చంద్రబాబు అభివాదం చేశారు. జైలు ప్రధాన ద్వారం నుంచి చూస్తే చూసినంత దూరం కిక్కిరిసిన ప్రజాసమూహాన్ని... చిక్కటి చిరునవ్వులతో పలకరించారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మనవడు దేవాన్ష్‌ను ఆత్మీయంగా హత్తుకున్నారు. జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపిన రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు, దేశ-విదేశాల్లోని ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
అందరికీ కృతజ్ఞతలు చెప్పిన తర్వాత కూడా జైలు పరిసరాల నుంచి వెళ్లడం చంద్రబాబుకు చాలా కష్టతరమైంది. వెల్లువెత్తిన అభిమాన జనానికి మరోసారి అభివాదం చేస్తూ... చిరునవ్వులతో నెమ్మదిగా అక్కడినుంచి ముందుకు సాగిపోయారు. గుండెలనిండా అభిమానం నింపుకొన్న జనసాగరం... "నాయకుడా.. నాయకుడా.. మళ్లీ నువ్వే రావాలి" అంటూ జయజయధ్వానాలు చేశారు. బాబుకోసం మేముసైతం అంటూ... ఆయన వాహనశ్రేణి వెంట పరుగులు తీశారు. వచ్చేది చంద్రన్న రాజ్యమేనంటూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.
ప్రజల కోసం పనిచేసిన నాయకుడు... పాలకుల పగతో జైలుకెళ్లినా... ఆ గోడలను దాటి బయటికొస్తే అభిమానం కుండపోతలా కురుస్తుందని రుజువైంది.