Chandrababu Expressed his Anguish Before Judge: ఏ తప్పు చేయకపోయినా తనకు.. ఈ వయసులో పెద్ద శిక్ష వేశారంటూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. బందిపోటులా అరెస్టు చేసి జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ న్యాయాధికారి ముందు హాజరైన చంద్రబాబు.. ఏం జరిగిందో సీఐడీ తెలుసుకొనే ప్రయత్నం చేయలేదన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండును ఈ నెల 24 వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రిమాండు కాలం ముగియనుండటంతో శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును జైలు అధికారులు ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు.
ఈ సమయంలో చంద్రబాబుతో న్యాయాధికారి హిమబిందు నేరుగా మాట్లాడారు. కారాగారంలో ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. కోర్టు ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా అని ప్రశ్నించారు. దోమలు ఉన్నాయని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని చంద్రబాబు ఆమెకు బదులిచ్చారు. మీ నుంచి కొన్ని విషయాలు సేకరించాలని.. మిగిలిన నిందితులతో మీకున్న సంబంధం ఏమిటనేది తేల్చేందుకు అయిదు రోజుల పోలీసు కస్టడీ కావాలని సీఐడీ పిటిషన్ వేసింది.. దానిపై చెప్పేది ఏమైనా ఉందా అని న్యాయాధికారి ప్రశ్నించారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీఐడీ కనీస ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా చంద్రబాబు బదులిచ్చారు. వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇవ్వలేదు నోటీసు ఇవ్వలేదు.. అవకాశం ఇస్తే వివరాలు చెప్పేవాడిన్నారు. తన తప్పేమైనా ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని.. ఏకపక్షంగా అరెస్టు చేశారన్నారు. సీఐడీ కార్యాలయలో విచారించి సమాచారం సేకరించారన్నారు. ఫైళ్లన్నీ వారి వద్దే ఉన్నాయని.. పోలీసు కస్టడీలో విచారించాల్సినది ఏముంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదన్న చంద్రబాబు.. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశానన్నారు. తప్పు చేయకపోయినా ఈ వయసులో తనకు పెద్ద శిక్ష వేశారన్నారు. అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్టు చేశారని జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తన బాధ, ఆవేదనన్న చంద్రబాబు సీఐడీది కక్షసాధింపు చర్యగా పేర్కొన్నారు. నోటీసు ఇచ్చి వివరణ తీసుకునే కనీస ప్రయత్నం చేయకుండా తనని ఓ బందిపోటులా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చట్టాలపై అవగాహన ఉంటుందని అనుకుంటున్నా అని ఈ సందర్భంగా న్యాయాధికారి అన్నారు. ప్రస్తుతం మీపైన వచ్చింది ఆరోపణ మాత్రమే.. ఆ ఆరోపణ నిజమా.. కాదా అనేది దర్యాప్తు సంస్థ చూసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలోనే ఉందని.. సామాన్యుడైనా, మాజీ సీఎం విషయంలోనైనా చట్టప్రకారం నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
మీరు పెద్దవారు దీన్ని శిక్షగా భావించకూడదన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను మీరు హుందాగా గౌరవించాలని తెలిపారు. ప్రస్తుతం మీరు కోర్టు కస్టడీలో ఉన్నారు.. తప్ప పోలీసు కస్టడీలో కాదన్నారు. మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదని.. కోర్టుపై విశ్వాసం ఉంచాలని న్యాయాధికారి పేర్కొన్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించాలని.. ఔషధాలు, ఇంటి నుంచి భోజన వసతులకు అనుమతించాలంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు విషయంలో నివేదిక ఇవ్వాలని కారాగార అధికారులను ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఆదేశించారు.