Chandigarh university protest : పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న చండీగఢ్ ప్రైవేటు యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. తమ ప్రైవేట్‌వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారంటూ వర్సిటీలోని మహిళా విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తమతో పాటే హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని.. తాము బాత్‌రూముల్లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసిందని ఆరోపించారు. ఈ వీడియోలను ఆమె.. తన స్నేహితుడికి పంపగా, అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలంటూ.. వర్సిటీ ప్రాంగణంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు.
తమ వీడియోల విషయం బయటకు పొక్కడంపై మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగింది. సమాచారం తెలుసుకొని విశ్వవిద్యాలయానికి చేరుకున్న పోలీసులు.. వీడియో రికార్డు చేసిన విద్యార్థినిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తమ ప్రైవేటు వీడియోలు బయటకు పొక్కాయనే కారణంతో యూనివర్సిటీలో కొందరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారనే ఆరోపణలను పోలీసులతోపాటు వర్సిటీ వర్గాలు ఖండించాయి. వీడియోల వ్యవహారం బయటపడగానే ఓ యువతి అస్వస్థతకు గురైందని.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మరోవైపు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ విద్యార్థిని అరెస్టుచేసి విచారిస్తున్నట్లు వివరించారు. రికార్డు చేసిన వీడియోలను సిమ్లాలోని తన స్నేహితుడికి వాటిని పంపగా.. అతడు ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశాడని ప్రచారం జరుగుతుండగా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
"ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో మాట్లాడాం. ఆమెను విచారించాం. ఫోన్‌లో ఆమె వీడియో మాత్రమే ఉంది. ఇతర విద్యార్థుల వీడియోలు ఏమీ ఆమె ఫోన్‌లో లేవు. ఎలాంటి వీడియో రికార్డు చేయలేదని ఆమె చెప్పింది. ఆమె వద్ద ఉన్న ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. ఆమె స్నేహితులను విచారించేందుకు ప్రత్యేక బృందాలను పంపాం. ఇప్పటివరకూ దొరికిన ఆధారాల ప్రకారం ఫోన్‌లో ఆమె వీడియో మాత్రమే ఉంది. మిగతా వారి వీడియోలు లేవు"
వివేక్‌సోనీ, మెహాలీ ఎస్‌ఎస్పీ
విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ కోరారు. అత్యంత తీవ్రమైన ఈ అంశంలో దోషుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. మరోవైపు యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఘటన చాలా తీవ్రమైనదని ఆమ్‌ఆద్మీ పార్టీ ఛీఫ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో భాగమైన దోషులందరికీ కఠిన శిక్ష పడుతుందన్న ఆయన.. బాధిత విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని, వారి వెంట తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: పోలీసులపై గ్రామస్థుల దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు.. అదే కారణం!
'సూపర్ పవర్‌గా భారత్.. ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించేలా దేశీయ వ్యవస్థలు!'