Central Govt guidelines for buy Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే సహకరించాల్సిన కేంద్రం.. మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు విశాఖ ఉక్కుకు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా మరే ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసేందుకు వీల్లేదని నిబంధనల్లో పేర్కొంది. ఒకవేళ ప్రజా ప్రయోజనాల రీత్యా కొనాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. అయితే ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కొనుగోలుకు.. కేంద్రం అనుమతిస్తుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఉక్కు పరిశ్రమను తెలంగాణ సర్కారు కొనడంపై.. కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో కేంద్రం జారీచేసిన ఉత్తర్వులు.. అది అసాధ్యమని స్పష్టం చేస్తున్నాయి.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి వంటి మరే ఇతర ప్రభుత్వ సంస్థ అమ్మకానికి పెట్టినా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను.. కొనడం కుదరదని ఆ ఉత్తర్వుల్లో కేంద్రప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉక్కు పరిశ్రమను అమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమిస్తున్నందున.. ప్రజాప్రయోజనాలరీత్యా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనేందుకు ముందుకొచ్చినా అందుకు కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరని మరో నిబంధన విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటూ కొనలేదు.. తెలంగాణ కొనాలన్నా కేంద్రం అనుమతించే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు అధికారులు. ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేటీకరణ చేసేందుకు 2022 ఏప్రిల్ 19న కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణకు ఇంకా కేంద్రం నోటిఫికేషన్ జారీచేయలేదు. కానీ ప్రైవేటీకరణ తప్పదని చెబుతోంది. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో సింగరేణి లేదా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ.. విశాఖ ఉక్కు పరిశ్రమను కొనేందుకు ఎలాంటి అవకాశాలున్నాయాని అధికారులు అంతర్గతంగా పరిశీలన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఏడాది క్రితం జారీచేసిన ఉత్తర్వులు అడ్డంకిగా మారతాయని వైజాగ్ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని సీనియర్ అధికారులు తెలంగాణ సర్కారుకి నివేదించినట్లు తెలుస్తోంది.
సింగరేణి సంస్థలో 51 శాతం వాటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే.. మిగిలిన 49 శాతం కేంద్రం వాటాగా ఉంది. ఎట్టిపరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమలో సింగరేణి పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం ఉత్తర్వుల ప్రకారం చెల్లదని అధికారులు స్పష్టంచేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి అని వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇవీ చదవండి: