YS Bhaskar Reddy CBI Enquiry: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఆదివారం.. నిందితులు వైఎస్ భాస్కరరెడ్డితో పాటు ఉదయ్‌కుమార్ రెడ్డిని ఐదోరోజూ విచారించారు. ఉదయం 9 గంటలకే చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను సీబీఐ అధికారులు కోఠిలోని తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. వివేకానందరెడ్డి మృతదేహంపై గొడ్డలిపోట్లు స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు, రక్తపు వాంతులతో కూడిన మరణంగా ప్రచారం ఎందుకు చేశారనే అంశంపై పలు ప్రశ్నలు సంధించారు.
ఆ ప్రశ్నలపై భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ: హత్యాస్థలిని భాస్కరరెడ్డి తన అధీనంలోకి తెచ్చుకొని రక్తపు మరకల్ని శుభ్రం చేయించారని సీబీఐ అనుమానిస్తోంది. భాస్కరరెడ్డిని ఈ విషయమై ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. వివేకా హత్య సమయంలో పడకగది, బాత్రూంలో చిందిన రక్తపు మరకల్ని కడిగించడం.. ఆసుపత్రి నుంచి కాంపౌండర్‌ను పిలిపించి మృతదేహానికి బ్యాండేజీతో కట్లు కట్టించడం.. వివేకా గుండెపోటుతో మరణించారని పోలీసులకు సమాచారమివ్వడం.. అదే నిజమని నమ్మించేందుకు గాయాలు కనిపించకుండా పూలతో అలంకరించడం.. ఫ్రీజర్‌బాక్స్‌ను తెప్పించడం.. గుండెపోటు మరణం అని ప్రచారం చేయడం.. లాంటి పరిణామాల వెనక భాస్కరరెడ్డి పాత్ర గురించి ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
వివేకా హత్య గురించి ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసింది: వివేకా హత్య జరిగిన తర్వాత తెల్లవారుజామునే ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటి నుంచి బయటకు రావడంపై సీబీఐ ప్రశ్నించింది. తెల్లవారుజామున 3 గంటల35 నిమిషాలకే బయటకొచ్చి, 4గంటల ఒక నిమిషం వరకు పులివెందులలో తచ్చాడినట్లు సీబీఐకి శాస్త్రీయ ఆధారాలు లభించాయి. వివేకా మరణించారంటూ అదే సమయంలో తల్లికి ఉదయ్‌కుమార్‌రెడ్డి చెప్పారనేది సీబీఐ అభియోగం. హత్యలో పాల్గొన్నట్లు చెబుతున్న నలుగురితో పాటు ఘటనాస్థలిలో వారిని చూసిన వాచ్‌మన్ రంగయ్యకు తప్ప వివేకా మరణం గురించి బయటి ప్రపంచానికి తెలియని ఆ సమయంలో మీకెలా తెలిసిందని ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
ఉదయం 6 గంటల25 నిమిషాలకు భాస్కరరెడ్డి ఇంటికి రావడానికి కారణాలేంటని ఆరా తీసినట్లు సమాచారం. ఇలా ఒకరి నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని మరొకరి వాంగ్మూలంతో పోల్చుకుంటూ ఇద్దరినీ సుదీర్ఘంగా విచారించినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు వీరిద్దరి విచారణ కొనసాగింది. అనంతరం వారిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారంతో వీరిద్దరి కస్టడీ ముగియనుండటంతో చివరి రోజు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.
దిల్లీ వెళ్లిన సీబీఐ బృందం: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో గత కొన్ని రోజులుగా తాము చేసిన విచారణకు సంబంధించిన వివరాలన్నింటినీ తీసుకుని, సీబీఐ బృందం దిల్లీ వెళ్లింది. నేడు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. ఈ కేసులో అరెస్టు చేసిన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డినీ సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో వెల్లడైన అంశాలతో పాటు సాంకేతిక ఆధారాలనూ తీసుకుని ఈ బృందం దిల్లీ వెళ్లినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: