CBI Notices to MP Avinash Reddy: వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు విచారించిన అధికార్లు.. సోమవారం మరోసారి రావాలని కబురు పంపారు. అయితే పులివెందులలో పార్టీ కార్యక్రమాలు ఉన్నందున.. తాను ఈసారి విచారణకు హజరుకాలేనని.. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీంతో ఈ నెల 10 వ తేదిన విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ తేదికి సరేనన్న ఎంపీ.. విచారణకు హజరవుతానని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే.. సోమవారం రోజున ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హజరైయ్యే అంశంపై తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సోమవారం తప్పనిసరిగా హాజరు కావల్సిందేనని.. అధికారులు శనివారం రాత్రి స్పష్టం చేశారు. అయితే ముందుగా షెడ్యూల్లో ఉన్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో.. వేంపల్లెలో సమావేశం ఉంది.
దీంతో ముందుగానే నిర్ణయమైన దాని ప్రకారం ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున.. వివేక హత్య కేసు విచారణకు రాలేనని సీబీఐకి ఎంపీ ఆదివారం లేఖ రాయగా.. ఆ మేరకు, సీబీఐ అనుమతిచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆదివారం రాత్రి పులివెందులలో అవినాష్ ఇంటికి వెళ్లి నోటీసును సీబీఐ అధికారులు అందజేశారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు.
అంతకు ముందు, ఈనెల 12న కడపలో విచారణకు రావాలని 5 రోజుల క్రితమే భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. తన తండ్రికి వచ్చిన నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్‌రెడ్డి ఈనెల 10న సీబీఐ ఎదుట తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. అలాగే, 12న అవినాష్ రెడ్డి తండ్రి.. భాస్కర్‌రెడ్డి కడపలో విచారణకు హాజరవుతారని వెల్లడించారు.
వివేకా హత్య జరిగిన విషయం బాహ్య ప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలిస్తే.. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డికి అంతకుముందే తెలుసని సీబీఐ భావిస్తోంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచివేయించడం, మృతదేహానికి కట్లుకట్టి ఆస్పత్రికి తరలించడం, గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారనేది సీబీఐ వాదన.
హత్య జరిగిన ముందు రోజు మార్చి 14వ తేదీన సాయంత్రం ఏ-2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి పావు గంట సమయం.. అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని గూగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐ ఆధారాలు సేకరించింది. దీంతో ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుట్ర చేసి ఉండచ్చని సీబీఐ అనుమానిస్తోంది.
ఇవీ చదవండి: