Murder Attempt Case On Chandrababu: చిత్తూరు జిల్లా అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణలపై.. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముదివీడు పోలీసు స్టేషన్‌లో ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలపై కేసు పెట్టారు. ఈ కేసులో ఏ-1 గా చంద్రబాబు, ఏ-2గా దేవినేని ఉమ, ఏ-3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ-4గా.. ఎమ్మెల్సీ రాం గోపాల్‌రెడ్డి సహా నల్లారి కిషోర్, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని పేర్లను ఏఫ్ఐర్లో చేర్చారు. 20 మందితో పాటు.. ఇతరులంటూ మరికొందరు తెలుగుదేశం నేతలపైనా కేసులు నమోదు చేశారు. ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, కర్రలతో వచ్చారని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో తెలిపారు. దీని ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లాలోనూ చంద్రబాబుపై కేసు: చిత్తూరు జిల్లాలో మాత్రమే కాకుండా మరో వైపు అన్నమయ్య జిల్లాలోనూ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని ములకలచెరువు పీఎస్‌లో చంద్రబాబును ఏ-7గా చేర్చూతూ కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త చాంద్‌బాషా ములకలచెరువు పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారని చాంద్‌బాషా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
TDP Rally In Nandigama : జగన్ పాలనలో మైనార్టీలపై అక్రమ కేసులు పెరిగాయి: ఎంఏ షరీఫ్
కేసులపై స్పందించిన ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి : ముదివీడు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని చంద్రబాబు పర్యటిస్తున్నారని అన్నారు. వైసీపీకి చెందిన వాళ్లే దాడులు చేస్తారని.. కేసులు మాత్రం మాపై పెడతారా అని భూమిరెడ్డి ప్రశ్నించారు. దాడుల్లో పోలీసులే సాక్ష్యమని.. వారికి కూడా దెబ్బలు తగిలాయని ఆయన వివరించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి కోసం.. ప్రతిపక్షాలు నోరు మెదిపితే తప్పుడు కేసులు : బీవీ రాఘవులు