ఇటీవల నిత్య పెళ్లికొడుకుల వార్తలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అమాయకమైన మహిళలను మాయ మాటలతో మోసం చేసి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే బిహార్‌లో జరిగింది. చోటు కుమార్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలో ఆర్కెస్ట్రా బ్యాండ్‌లో పని చేసే చోటు.. తన మొదటి భార్యతో కోల్‌కతా వెళుతుండగా బిహార్‌లోని జమయూ రైల్వే స్టేషన్లో రెండో భార్య సోదరుడు వికాస్దాస్ అడ్డుకున్నాడు. చోటును తమ ఇంటికి రమ్మని పిలిచాడు. అందుకు నిరాకరించి, మొదటి భార్యతో కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీంతో దాస్.. చోటును బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తూ చోటు కుమార్‌ను విడిచిపెట్టారు.
"నేను ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నానని అనటం కేవలం ఆరోపణే. ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన కళావతి నా మొదటి భార్య. బిహార్ జముయూ జిల్లా సుందర్టాండ్కు చెందిన మంజూదేవి నా రెండో భార్య. 2018, 2020లో రెండు పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి. కానీ మిగతా నలుగురితో పెళ్లి జరిగిందని అనడం ఆరోపణ మాత్రమే" అని చోటు చెప్పాడు.
ఈ విషయం గురించి చోటు అత్త కొబియా దేవి మాట్లాడుతూ.. "ఇతడు సంవత్సరం నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. మందులు తీసుకొస్తానని బయటకు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. నా కూతురు జీవితం మాత్రమే కాకుండా చాలా మంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు" అని ఆరోపించింది.