Bihar man dozen marriage: బిహార్ పూర్ణియా జిల్లాలో 12 వివాహాలు చేసుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాలికను కిడ్నాప్ చేసి పదమూడో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆరేళ్లుగా అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడు తనను తాను బ్యాచిలర్ అని చెప్పుకుంటూ ఇప్పటివరకు 12 వివాహాలు చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. 13వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కాగా.. అంతకుముందే అతడిని పట్టుకున్నారు.
నిందితుడు షంషద్.. కిషన్‌గంజ్ జిల్లాలోని కొచ్ఛాదమన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అనార్కలీ గ్రామంలో నివసిస్తున్నాడు. 2015 డిసెంబర్ 8న బిజ్వార్ గ్రామానికి చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తన మైనర్ కూతురిని షంషద్ కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికను అప్పుడే పట్టుకున్నారు. కానీ, షంషద్ ఎలాగో తప్పించుకోగలిగాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా నిందితుడు జాగ్రత్తపడుతున్నాడు.
మరోవైపు, పోలీసులు అతడి కోసం ఎప్పట్నుంచో వెతుకుతున్నారు. తాజాగా, కోయిదంగి గ్రామంలో నిందితుడు తలదాచుకుంటున్నట్లు సమాచారం అందుకున్నారు. బహదుర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ గ్రామం నుంచి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో షంషద్ నిజం ఒప్పుకున్నాడు. డజన్ పెళ్లిళ్లు చేసుకున్నట్లు అంగీకరించాడు.
షంషద్కు అప్పటికే పెళ్లి అయిందని.. అతడిని వివాహం చేసుకున్నవారెవరికీ తెలియదు. ఇప్పటివరకు ఏడుగురు భార్యలను సంప్రదించి సమాచారం సేకరించారు. అబద్దాలు చెప్పి తమను వివాహం చేసుకున్నాడని బాధిత మహిళలు చెప్పారు. ప్రేమ ముసుగులో తమను మోసం చేశాడని తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలోనూ నిందితుడు మరో పెళ్లి పనుల్లో ఉన్నాడు. మైనర్‌తో నిఖా చేసుకోవాలని భావించాడు. ఆ బాలికను సైతం కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని జైలుకు తరలించారు.
ఇదీ చదవండి: