పది, 12 తరగతి బోర్డు పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆయా తరగతుల్లో టాప్-10 విద్యార్థులకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహిస్తున్న సీఎం.. గురువారం బలరాంపూర్ జిల్లాలోని రాజ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు.
"రాష్ట్రస్థాయి/ జిల్లా స్థాయిల్లో టాపర్లుగా నిలిచినవారికి హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పిల్లలను మరింతలా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ హెలికాప్టర్ రైడ్.. పిల్లలు తమ జీవిత గగనతలంలో ఎగరాలనే కోరికను పెంపొందిస్తోంది.. తద్వారా తమ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలకు మరింత పదును పెట్టేందుకు దోహదం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. "
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి.
బుధవారం సామ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం భూపేశ్ బఘేల్.. అక్కడ మూడు ఆత్మానంద్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు ఎంతో ప్రతిభ ఉందనీ.. కాకపోతే వారికి ప్రేరణ అవసరమని గ్రహించానన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను రాయ్‌పూర్‌కు ఆహ్వానించి వారందరూ హెలికాప్టర్‌లో గగనంలో విహరించే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు.
ఇదీ చూడండి: 42 ఏళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం.. టీచర్‌కు 25 ఏళ్ల జీతం