సామాజిక దూరం విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన సూచనలు.. కరోనా నియంత్రణకు సరిపడవని ఓ అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి లక్షణాలున్న వ్యక్తి తుమ్మడం, దగ్గడం, చీదడం ద్వారా శరీరం నుంచి బయటకొచ్చే వైరస్.. సుమారు 18 అడుగుల దూరం వరకు ప్రయాణించగలదని సైప్రస్‌లోని నికోసియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.
గాలి ద్వారా వ్యాప్తి సాధ్యమా!
గాలి ద్వారా కరనా సోకుతుందా? వైరస్ ఎంత సమయం గాలిలో ఉంటుంది? వంటి విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6 అడుగుల సామాజిక దూరం కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధనను ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
"గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిలోనే.. తేలికపాటి తుంపర్లు 18 అడుగుల దూరం ప్రయాణిస్తాయి. అందుకు 5 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అయితే ఆ తుంపర్లు గాలిలో ఎలా ప్రయాణిస్తున్నాయి అనే అంశంపై లోతైన అధ్యయనం చేస్తున్నాం. వ్యక్తి ఎత్తుతో సంబంధం లేకుండా వైరస్ అందర్నీ ప్రభావితం చేయగలదు"
-- దిమిత్రిస్ డ్రికాకిస్, నికోసియా విశ్వవిద్యాలయ పరిశోధకుడు.
ఎంత సమయం ఉంటుంది?
దగ్గడం, చీదడం ద్వారా శరీరం నుంచి వెలువడే తుంపర్లతో పాటే వైరస్ బయటకు వస్తుంది. అయితే ఇది గాలిలో ఎలా ప్రయాణిస్తుంది? అన్నదానిపైనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు చేసిన పరిశోధనల అనంతరం కొన్ని కారణాలు విశ్లేషించారు.
తుమ్ము, దగ్గు, చీదిన వేగం, తుంపర్ల పరిమాణం, విడుదలయ్యాక గాలిలో మిగతా వాటితో ఉండే సంబంధం, ఆవిరయ్యే సమయం, వేడి/ఉష్ణోగ్రత ప్రభావం, గాలిలో తేమ వంటి అంశాలు గాలిలో మహమ్మారి మనుగడపై ప్రభావం చూపిస్తాయి.
పరిశోధనలో 1,008 తుంపర్లను పరిశీలించారు. ఆ డేటాను కంప్యూటర్ ఆధారంగా విశ్లేషించారు. వాటి నుంచి 3.7 మిలియన్ల సమీకరణాలు రాబట్టారు. రోగి నుంచి తుంపర విడుదలయ్యాక ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఒక్కో స్థితిలో అది ఎలా మార్పు చెందుతోంది? గాలిలో ఎంత సమయం దాని ప్రభావం ఉంటుంది? వంటి అంశాలపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు.
1930 నాటి పద్ధతుల ద్వారా వైరస్ ప్రయాణించే పరిధిని డబ్ల్యూహెచ్‌ఓ లెక్కగట్టింది. ఆ ప్రకారం ఆరు అడుగుల దూరం పాటించడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ప్రజలకు సూచించింది.