నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తలకు గాయాలయ్యాయి. మార్చి 3న ఉరి శిక్ష పడనుందన్న మానసిక ఒత్తిడితో తిహార్ కారాగారంలో తనంతట తానే గాయపర్చుకున్నాడు. జైలు గోడకేసి తలను బలంగా కొట్టుకున్నాడు. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినయ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు జైలు అధికారులు.
పలుమార్లు వాయిదా..
తొలుత జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా.. ఫిబ్రవరి 1కు వాయిదా పడింది. దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున మరోసారి వాయిదా వేస్తూ జనవరి 31న నిర్ణయం తీసుకుంది ట్రయల్ కోర్టు. దోషులకు మరోమారు డెత్ వారెంట్ జారీ చేయాలని దిల్లీ ప్రభుత్వం, నిర్భయ తల్లిదండ్రులు.. దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నలుగురు దోషులకు మార్చి 3న మరణ శిక్ష విధించాలని ఈనెల 17న తీర్పునిచ్చింది దిల్లీ కోర్టు.