భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఆశ్రమానికి ట్రంప్ రానున్నట్లు తెలిపారు.
"ఉదయం 11:30 గంటలకు అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్ చేరుకుంటారు. ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమానికి వెళ్తారు. ఆశ్రమం నుంచి రోడ్ షో కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇందిరా బ్రిడ్జి మీదుగా మోటేరా స్టేడియంకు పయనమవుతారు."
-ఆశిష్ భాటియా, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్
అయితే సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ ఎక్కువ సమయం గడపరని ఆశిష్ స్పష్టం చేశారు. ఆశ్రమ సందర్శన అనంతరం మోటేరా స్టేడియంలో మోదీ, ట్రంప్ ప్రసంగిస్తారని చెప్పారు.
సబర్మతీ ఆశ్రమ కార్యదర్శి అమృత్ మోదీ సైతం ట్రంప్ పర్యటనపై స్పష్టతనిచ్చారు.
"ట్రంప్ 'హృదయ్ కుంజ్'ను సందర్శిస్తారు. ఆశ్రమంలో 15 నిమిషాలు గడుపుతారు. ఆయన కోరుకుంటే చరఖా తిప్పుతారు. అయితే కార్యక్రమం మాత్రం 15 నిమిషాలకే పరిమితం."-అమృత్ మోదీ, సబర్మతీ ఆశ్రమ కార్యదర్శి
సబర్మతీ సందర్శనలో భాగంగా గాంధీజీ జీవిత విశేషాలు, చరఖా ప్రాధాన్యాన్ని ట్రంప్‌కు వివరించనున్నట్లు తెలిపారు అమృత్. కాఫీ టేబుల్ బుక్ సహా 150 గాంధీ సూక్తులతో కూడిన మరో పుస్తకాన్ని అధ్యక్షుడికి బహుకరించనున్నట్లు చెప్పారు.
సబర్మతీ ఆశ్రమంలో మహాత్ముడు ఆయన సతీమణితో నివసించిన గదినే హృదయ్ కుంజ్గా పిలుస్తారు. 1918 నుంచి 1930 వరకు ఈ గదిలోనే నివసించారు గాంధీ.