ETV Bharat / bharat

పీవీకి 'వంద'నం: సంస్కరణల సారథి.. అభివృద్ధికి వారధి - P.V.Narasimha Rao birthday celebrations

'వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు నాయకుడు. వస్తున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు' అని అంటారు. భారత తొమ్మిదో ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు రెండో కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు. ఆర్థిక సంస్కరణల పథ నిర్దేశకుడు, నవభారత నిర్మాత పీవీ. సొంత బలం లేకున్నా, బలగాలు లేకున్నా స్వీయశక్తితో, అపార మేథస్సు పెట్టుబడిగా ఎదిగిన విజేత. దేశ ఆర్థిక సంస్కరణల స్ఫూర్తిదాత పీవీ శతజయంతి సందర్భంగా 'ఈటీవీ భారత్​' అందిస్తున్న అక్షర నివాళి.

the analysis story of the former prime minister p v narismha rao
పీవీకి 'వంద'నం: సంస్కరణల సారథి.. అభివృద్ధి వారధి
author img

By

Published : Jun 28, 2020, 6:46 AM IST

దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న సమయంలో.. దిల్లీపీఠం ఎక్కిన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు ఆ సుడిగుండం నుంచి వ్యవస్థను గట్టెక్కించారు. పీవీ అధికారం చేపట్టిన నాడు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పీవీ ఎలాంటి సంస్కరణలు తెచ్చారు? అవి ఎలాంటి ఫలితాలనిచ్చాయి.? వాటి వల్ల దేశ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరాయి? ఆయన నెమ్మదిగా నిర్ణయాలను తీసుకుంటారనడంలో వాస్తవం ఎంత? ప్రపంచాన్ని కుదిపివేసిన ఆర్ధిక మాంద్యాలు మనదేశాన్ని ఏమీ చేయలేకపోయాయంటే పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుపర్చిన ఆర్థిక సంస్కరణలే కారణమా?

దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి జారుకుంటున్న కాలం. 1980లో అనుసరించిన విధానాలతో ద్రవ్యలోటు. భారత ఆర్థిక వ్యవస్థ కనీసం అప్పులు చెల్లించలేని దుస్థితికి చేరిన వేళ... డాలరు రెక్కలు విప్పుకొని ప్రపంచ ఆర్థికాన్ని శాసిస్తోంది. రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. దార్శనికతేలేని గత పాలకుల వైఫల్యాలు తరుముకొచ్చాయి.

బంగారు భవిష్యత్తు పణంగా పెట్టి జనాకర్షక విధానాలతో దేశాన్ని దివాలా తీయించారు గత పాలకులు. సోవియట్ యూనియన్ పతనమై అమెరికా రూపంలో ఏక ధృవ ప్రపంచం ఆవిష్కతమైన వేళ.. ఒక శతాబ్దం నిష్క్రమిస్తూ నవ శతాబ్దంలోకి ప్రవేశించడానికి మధ్య సంధికాలం అది.

1991 నాటికి విదేశీ రుణాలు తీర్చలేని దుస్థితికి భారత్​ దిగజారింది. చెల్లింపుల కోసం బ్యాంకుల్లో ద్రవ్య నిల్వలు లేవు. బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఐఎంఎఫ్ రుణం కోసం భారత్ రెండు విమానాల్లో 67 టన్నుల బంగారాన్ని లండన్​కు, స్విట్జర్లాండ్​కు తరలించింది. గల్ఫ్ యుద్ధంతో మనదేశం మీద ఎనలేని భారం పడింది. ఆయిల్ దిగుమతుల భారం తడిసి మోపెడైంది. ఎగుమతులు క్షీణించాయి. ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసేసుకుంటున్నారు. దిగుమతులకు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది.

అంతర్జాతీయంగా మన దేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మరోవైపు ఆర్థిక సంక్షోభం కమ్ముకొస్తోంది. ఇటువంటి కష్టకాలంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర అప్పు చేయక తప్పని స్థితి వచ్చింది. బంగారపు నిల్వలు తాకట్టు పెట్టాల్సిన దురవస్థ ఏర్పడింది.. ఎటువంటి వైపరీత్యాలకూ చలించని మధ్య తరగతి వర్గం ఈ ఆర్థిక సంక్షోభంతో ఆందోళనకు గురైంది. సరిగ్గా అటువంటి సంధికాలంలో పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయ్యారు.

సొంత బృందంతో ఆర్థిక వ్యవస్థ అధ్యయనం

ప్రధాని అవడమే తరువాయి సొంత బృందంతో ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేశారు. ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు. అందుకు నేపథ్యం ఉంది. పీవీ నరసింహారావు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్​ను ఆర్థిక మంత్రిగా తీసుకుని నవ్య పథంతో సంస్కరణ రథాన్ని పరుగులెత్తించారు. మన్మోహన్ సింగ్, కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్య శాఖలో పనిచేస్తున్న మాంటేక్ సింగ్ ఆహ్లు వాలియాలు ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందే ఆహ్లువాలియా రూపొందించిన ఎం-డాక్యుమెంట్ లో అన్ని అంశాలు ఇందుకు ఉపకరించాయి.

సుంకాలు గణనీయంగా తగ్గింపు

పారిశ్రామికవేత్తల దశాబ్దాల మొర ఆలకించి విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధిస్తున్న సుంకాలను గణనీయంగా తగ్గించారు. అది స్వదేశీ పరిశ్రమల ఎదుగుదలకు తోడ్పడింది. అప్పట్లో ఏది దిగుమతి చేసుకోవాలన్నా లైసెన్సులు తప్పనిసరి. పీవీ సరళీకృత ఆర్థిక విధానాలు లైసెన్స్ కోటా రాజ్​కు స్వస్థి చెప్పాయి. ఒక్క కలంపోటుతో పీవీ లైసెన్స్ కోటా విధానాలను రద్దు చేశారు. స్టాక్ మార్కెట్ నిబంధలను సడిలించారు. ఈ విప్లవాత్మక చర్యలు స్థానిక పరిశ్రమల మనుగడకు ఊపిరి పోశాయి. విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవటం మీద ఆంక్షలుండేవి. వీటిని సడిలించారు. ప్రతి వ్యక్తి తలా 5 కిలోల బంగారం విదేశాల నుంచి బంగారం పన్నులు చెల్లించకుండానే తెచ్చుకొనేందుకు వీలు కలిగింది. అందువల్ల గోల్డ్ స్మగ్లింగ్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల స్మగ్లింగ్ బాగా తగ్గిపోయింది. పీవీ ఆర్థిక సంస్కరణలతో విదేశీ మదుపర్లకు ద్వారాలు తెరుచుకున్నాయి. కోక్, నైక్ లాంటి విదేశీ కంపెనీలు మనదేశంటో ఉత్పాదన కర్మాగారాలు తెరిచాయి. ముంబయి స్టాక్ ఎక్చేంజీ బలపడింది. ప్రభుత్వం లాభసాటిగా లేని తన సంస్థలను ప్రైవేటు రంగానికి విక్రయించింది. నిరర్ధక ఆస్తులను వదిలించుకునేందుకు పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభించింది. దీంతో ప్రభుత్వ అవసరాలకు నగదు అక్కరకొచ్చింది.

చైనా స్ఫూర్తితో..

నెమ్మదిగా ఉంటారని, నిర్ణయాలు త్వరగా తీసుకోరని పీవీ నరసింహారావు మీద ఒక సుతిమెత్తని విమర్శ ఉంది. కానీ ఈ దేశ ప్రధానులందరిలో అత్యంత వేగంగా పనిచేసింది పీవీ నరసింహారావేనని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రధానమంత్రి పీఠం ఎక్కగానే ఆయన వెనువెంటనే కార్యరంగంలోకి దిగారు. అదుపుదప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని శక్తిమంతమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. అలాంటి సంస్కరణలు చేపట్టడానికి ఆయనకు స్ఫూర్తినిచ్చిందెవరో తెలిస్తే ఆశ్చర్యపోవాలి. పీవీ స్ఫూర్తిదాత మరెవరో కాదు. మనకు తరచూ తలనొప్పిగా, సమస్యగా మారుతున్న డ్రాగన్ దేశం చైనాయే.

చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, ప్రభుత్వాధినేత డెంగ్ జియావో పెంగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పీవీకి స్ఫూర్తినిచ్చాయి. మన దేశం సరసనే ఉన్న డ్రాగన్ దేశం అభివృద్ధి పథాన పయనిస్తూ అగ్రరాజ్యం అమెరికాతో పోటీపడుతోంది. మన దేశ పయనం అధోముఖంగా ఉంది. అధ:పాతాళానికి దిగజారుతోంది. మన పతనం ఏమిటి? చైనా పనితనం ఏమిటి? ఎక్కడుంది లోపం? మనకంటే ఏడాది ఆలస్యంగా స్వాంతంత్ర్యం సాధించిన చైనా సంస్కరణలతో ముందుకు వెళ్లడాన్ని పీవీ నరసింహారావు ఎప్పుడో గ్రహించారు. 1981 నుంచే పలు సందర్భాల్లో చైనా ప్రగతిని పీవీ నరసింహారావు తన రచనా వ్యాసంగాల్లో ప్రస్తావించేవారు. సోవియట్ రష్యా మోడల్​లో రూపొందించిన నెహ్రూ మానసపుత్రికలైన పంచవర్ష ప్రణాళికా విధానాలను పక్కన పెట్టారు. మందగమనంతో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థకు నవచేతన కల్గించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమం

పీవీ నరసింహారావు లైసెన్స్ కోటా రాజ్ విధానాలను రద్దు చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ దశ, దిశను మార్చివేశారు. భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం వేశారు. బీఎస్ఎన్ఎల్ సేవల మీద ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించారు. దీంతో ప్రైవేటు మొబైల్ సేవా నిర్వాహకులు రంగంలోకి వచ్చారు. పీవీ కొత్త గవాక్షాలు తెరిచి ప్రభుత్వ ఏకస్వామ్యాన్ని బద్దలు కొట్టడం వల్లనే ఇవాళ టెలికాం మార్కెట్లో పోటీ పెరిగింది. వినియోగదార్లకు ప్రత్యేక ఆకర్షణలతో ప్రైవేటు టెలికాం కంపెనీలు అందుబాటు ధరలకు డేటా ప్యాక్ లు అందించే పరిస్థితి పీవీ సరళీకృత ఆర్థిక విధానాల చలవే.

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణం

పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణం జరిగింది. టోల్ రోడ్లు వచ్చాయి. మౌలిక సదుపాయాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. సరళీకరణతో పెరిగిన ప్రభుత్వ ఆదాయాన్ని ఆయన విద్య, ఉపాధి, ఉపాధి హామీ పథకాలకు వెచ్చించారు. నాటి జవహర్ రోజ్‌గార్, నేటి నరేగా.. పథకాల పేర్లు ఏవయినా అవి సమర్థంగా అమలు కావటానికి పీవీ తీసుకొచ్చిన సంస్కరణలే బాటవేశాయి. ఫలాలు గ్రామసీమలకు అందుతూ పల్లెల రూపురేఖలను మార్చివేశాయి.

శీతల పానీయాలు ప్రజల ముంగిటకు

జనతాపార్టీ ప్రభుత్వ హయాంలో నిషేధించిన కోకకోలా పానీయాన్ని పీవీ మళ్లీ దేశంలోకి అనుమతించారు. విదేశీ బ్రాండ్ల శీతల పానీయాలు ప్రజల ముంగిటకు వచ్చాయి. తలస్నానం చేయటానికి ఖరీదైన షాంపూలు కొనే తాహతు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉండదు. అలాంటి వారికోసం కంపెనీలు సాచెట్లలో షాంపూలు అందుబాటులోకి తెచ్చాయి. అదీ సంస్కరణల ఫలితమే. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ద్రవ్యమారక విలువను తగ్గించేందుకు నాటి ప్రధాని పీవీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌కు అనుమతించారు. ఇందువల్ల ఎగుమతులు పెరిగాయి. అందువల్ల భారతీయ వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడటానికి వీలు కలిగింది.

ప్రైవేటు విమానయాన సంస్థలు రంగప్రవేశం

విమానయానంలో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉండేవి. పీవీ విధానాలతో ప్రైవేటు విమానయాన సంస్థలు రంగప్రవేశం చేశాయి. మొట్టమొదటగా జెట్ ఎయిర్ వేస్ వచ్చింది. తర్వాత ఈస్ట్ వెస్ట్.. ఇంకా అనేక ప్రైవేటు విమానయాన సంస్థలు సేవలు అందిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు పెనుమార్పులు తెచ్చాయి. పీవీ ప్రభుత్వం 1993లో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. దీంతో మార్కెట్లో రుణ సదుపాయం సులభతరమైంది. బర్రెలు, గొర్రెల పంపిణీయే పేదరిక నిర్మూలన కార్యక్రమంగా చలామణీ అయిన ఇందిరాగాంధీ విధానాలను పీవీ నరసింహారావు సమూలంగా మార్చివేశారు. అమెరికా ఒత్తిళ్లను లెక్కచేయక ఆయన స్వతంత్ర్య విధానాన్ని అవలంబించి అణు బాంబుల తయారీలో మనదేశాన్ని ఒక శక్తిగా తీర్చిదిద్దారు.

నాడు ఒకటే.. నేడు 832 టీవీ ఛానెళ్లు

2008లో ప్రపంచాన్ని పట్టి కుదిపివేసిన ఆర్థిక మాంద్యం మనదేశాన్ని ఏమీ చేయలేకపోయింది. సంక్షోభ ఛాయలు స్వల్పంగా తాకినా త్వరగా గట్టెక్కగలిగింది. అందుకు కారణం నాడు పీవీ నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే. సంస్కరణలకు ఒకే వైపును చూడకూడదు. రెండు పార్శ్వాలనూ చూడాలి. ఆనాడు అది కోట్లాది ప్రజల మనోభావాలతో, అభిరుచులు, ఆకాంక్షలతో నిమిత్తం లేని ఒకే ఒక్క టీవీ ఉండేది. మండీ హౌస్ నుంచి నడిచే దూరదర్శనే దిక్కుగా ఉండేది. పీవీ నూతన ఆర్థిక సంస్కరణ పథం ఒకే టీవీ ఛానెల్ ను చూడాల్సిన దురవస్థను తప్పించింది. ఇవాళ వీక్షకులు తమ అభిరుచులకు అనుగుణంగా 832 టీవీ ఛానెళ్లను వీక్షించే సదుపాయం వచ్చింది.

పీవీ సంప్రదాయ ఆర్థిక విధానాలను విడిచిపెట్టి నూతన ఆర్థిక విధానాలు చేపట్టి వినియోగదారుల ఆకాంక్షలు తీరే సంస్కరణలు తెచ్చారు. ఇవాళ రకరకాల ప్రత్యేకతలతో మార్కెట్లో మొబైల్ ఫోన్లు విలాసంగా కొలువు తీరాయంటే పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే కారణం. మొబైల్ ఫోన్ల విప్లవం ఆయన చలవే అని చెప్పాలి. దేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన నిలిపిన ఘనత పీవీ నరసింహారావుదే. అణుపరీక్షల సమయానికి అధికార పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.