కరోనా సంక్షోభం, లాక్డౌన్ వేళ చాలా మంది భవిష్యత్తుపై భయంతో గడిపితే.. మరి కొందరు మాత్రం తమలోని కళను, సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేశారు. ఈ రెండో కోవలోకి చెందినవాడే కేరళ కొచ్చికి చెందిన కుర్రాడు హర్షద్. సొంతంగా ఓ మోటార్ సైకిల్ రూపొందించి అందరి చేత భళా అనిపించుకుంటున్నాడు.
నాన్న నేర్పిన విద్య
ఎర్నాకుళంలోని పల్లూరుతి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న హర్షద్‌కి బైక్ అన్నా, బైక్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. అందుకే వాళ్ల నాన్న నడిపే మెకానిక్ షాపులో ఉంటూ సాయం చేస్తుండేవాడు. తండ్రి ద్విచక్రవాహనాలను రిపేర్ చేయడం దగ్గరగా పరిశీలించి.. అలా బైక్ అసెంబ్లింగ్ నేర్చుకున్నాడు.
లాక్డౌన్ కలిసొచ్చింది..
ఇంతలో కరోనా సంక్షోభం తలెత్తడం, లాక్‌డౌన్‌తో పాఠశాలలకు సెలవులు రావడం వల్ల హర్షద్ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ సమయాన్ని వృధా చేయకుండా తనలోని సృజనాత్మకతను వెలికితీశాడీ కుర్రాడు. తాతకు చెందిన పాత మోటారు సైకిల్లోని ఇంజిన్ తీసుకుని, తండ్రి షాపులోని పరికరాలను ఉపయోగించి సొంతంగా తనే ఓ మోటార్ సైకిల్ తయారుచేశాడు.
"నాకు బైక్ అంటే చాలా ఇష్టం. అందుకే సొంతంగా ఓ బైక్ తయారు చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం మా షెడ్లోని ఓ జీఐ పైపు ముక్కను కత్తిరించి బైక్ తయారుచేయడం మొదలుపెట్టా. ఇది చూసి మా ఇంట్లో వాళ్లు మొదటతిట్టారు. కానీ తరువాత నాకు పూర్తి సహకారం అందించారు. దీనితో కేవలం 45 రోజుల్లోనే ఈ బైక్‌ను తయారుచేశా."
- హర్షద్, బైక్ తయారు చేసిన విద్యార్థి
లీటర్ పెట్రోల్‌తో..
'సీటు, బైక్ హ్యాండిల్‌బార్‌ను అనుసంధానించే పైపు పెట్రోల్ ట్యాంకర్‌గా పనిచేస్తుంది. ఈ ట్యాంక్ ఒక లీటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 45-50 కి.మీ మైలేజీని ఇస్తుందని' హర్షద్ చెబుతున్నాడు. తను చేసిన బైక్‌పై రైడ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు. త్వరలోనే ఓ ఎలక్ట్రానిక్ ట్రాలీ రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపాడు హర్షద్.
హర్షద్ సృజనాత్మకతను, బైక్‌ను చూసి అతని ఉపాధ్యాయులు, స్థానికులు, స్నేహితులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి: రీల్ కాదు రియల్.. గాల్లో ఎగిరిన ఆయిల్ ట్యాంకర్