ఆరు పదులు దాటిన వయస్సులో ఓ వృద్ధుడు 'ప్రేమ'లో పడ్డాడు. అది కూడా ఓ 16ఏళ్ల బాలికతో. ఆమె ఒప్పుకోపోయేసరికి బెదిరించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చివరకు ఆ వృద్ధుడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది.
66ఏళ్ల వయస్సులో...
66ఏళ్ల మహ్మద్ బాహిర్ బాషా.. తన పక్కింటిలో ఉంటున్న 16 ఏళ్ల బాలికపై మనసు పారేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశాడు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నీకు ఇష్టమేనా?' అంటూ మైనర్‌కు ప్రేమ లేఖ కూడా ఇచ్చాడు.
కంగారు పడిన బాలిక వెంటనే ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ బాషా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని వివరించారు. బాషా ప్రవర్తనకు ఆయన కుటుంబసభ్యులు క్షమాపణలు చెప్పారు.
కానీ.. ఆ బాలికను బాషా వదల్లేదు. ప్రేమిస్తున్నానని మళ్లీ వెంటపడ్డాడు. ఈసారి బెదిరించాడు కూడా. దీంతో తల్లిదండ్రులు బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద ఆ వృద్ధుడిని అరెస్టు చేసిన పోలీసులు.. కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి:- 11 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం