తమిళనాడులోని కోయంబత్తూర్ అటవీ ప్రాంతంలో గురువారం మూడు ఏనుగుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే ప్రాంతంలో అనారోగ్యం పాలైన మరో ఏనుగును గుర్తించారు అధికారులు.
బుల్లెట్ గాయంతో..
మెట్టుపాలాయంలోని కండియూర్ అటవీ ప్రాంతంలో ఓ 20ఏళ్లపైబడిన ఏనుగు మరణించింది. ఘటనాస్థలంలోనే ఆ గజరాజుకు శవపరీక్ష నిర్వహించిన అటవీ సిబ్బంది.. దాని తల భాగం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు స్థానిక రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు.
కోయంబత్తూర్ అటవీ ప్రాంతం సమీపంలోని సిరుముగై ప్రాంతంలో మరో ఏనుగు మృతదేహం లభించగా.. దాని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
విద్యుదాఘాతమే కారణమా?
నీలగిరిలోని మసినగిరి అటవీ ప్రాంతంలో మాదుమలైలో ఓ మగ ఏనుగు చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. ఆ గజరాజు.. విద్యుదాఘాతం వల్ల మరణించి ఉంటుందని ప్రాథమిక సమాచారం. అయితే పోస్ట్‌మార్టం తరువాతే అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలే సిరుముగై అడవుల్లో అనారోగ్యం బారినపడ్డ ఓ 20ఏళ్ల మగ ఏనుగుకు చికిత్స అందించారు అటవీశాఖ అధికారులు. ప్రస్తుతం దాని పరిస్థితి మళ్లీ విషమించిందని తెలిపారు.
14 రోజుల్లో 14 గజరాజులు...
కోయంబత్తూర్ పరిధిలో 14 రోజుల వ్యవధిలోనే 14 ఏనుగులు మరణించినట్లు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫలితంగా ఈ దశాబ్దంలో మొత్తం 141 గజరాజులు మృతిచెందినట్టు వివరించారు.
ఇదీ చదవండి: బావిలో పడిన ఏనుగు.. రోజంతా అందులోనే..