దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి పలు సడలింపులు ఇస్తూనే లాక్‌డౌన్ కొనసాగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది.
లాక్‌డౌన్ 4.0 గైడ్ లైన్స్ ఇవే...
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఇవన్నీ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వీటికి ఎలాంటి ఆటంకాలు కలిగినా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌లు తగిన చర్యలు తీసుకోవాలి.
కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు
- ఎక్కడెక్కడ రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.
- రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
- కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.
- కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.
రాత్రి కర్ఫ్యూ
రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్ అమలు చేయాలి.
ఆరోగ్య సేతు యాప్
ఆఫీస్‌లు, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలి.