లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా రైళ్ల పునరుద్ధరణ జరపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు మే 12 నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది.
దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రుగఢ్, అగర్తలా, హౌారా, పట్నా, బిలాస్‌పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ము తావిలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్ల కోసం ఆన్లైన్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్(https://www.irctc.co.in/) ద్వారా బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లు మాత్రం మూసే ఉంటాయి.
టికెట్ ఉన్న ప్యాసింజర్లనే రైళ్లలో ఎక్కించుకుంటారు. బయలుదేరే సమయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేని వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతినిస్తారు.
ఇప్పటికే 20వేలకుపైగా బోగీలు కరోనా కేంద్రాలుగా మారాయి. దాదాపు 300 రైళ్లు వలస కార్మికుల ప్రయాణం కోసం ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నవాటిని లెక్కించి.. దశలవారిగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనుంది భారతీయ రైల్వే.
దేశంలో లాక్డౌన్ కారణంగా మార్చి 25న ప్యాసింజర్ రైళ్ల సేవలను రద్దు చేశారు.